FbTelugu

ఆమె చూపు ఆ జిల్లా వైపు!

జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో పాదం మోపింది. ఇక్కడ పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తానని చెప్పారు. వైఎస్‌ తనయురాలు షర్మిల తెలంగాణలోని అన్ని జిల్లాల వైఎస్‌ఆర్‌ అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి కార్యకర్తల ద్వారా తెలుసుకొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కూడా నిర్వహించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు కూడా ఆమె ప్లాన్‌ చేసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. పార్టీ ఏర్పాటుకు కూడా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్టు షర్మిల అభిమానులు చెబుతున్నారు. అంతేకాదండోయ్‌.. వచ్చే ఎన్నికల్లో షర్మిల తెలంగాణ నుంచే పోటీకి దిగాలని కూడా నిర్ణయించుకున్నారట.

ఆమె స్వయంగా రంగంలోకి దిగేందుకు ఏ నియోజకవర్గం సేఫ్‌గా ఉంటుందో.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు ఎక్కడ ఎక్కువగా ఉంటారో.. ఎక్కడ తనకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో అన్న విషయాలపై కూడా ఆమె తీవ్రంగా చర్చలు జరిపినట్టు సమాచారం. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా నుంచి పోటీకి దిగితే విజయం వరిస్తుందని ఆ జిల్లా కార్యకర్తలు షర్మిలకు సూచించారట. ఆమె కూడా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధమైనట్టు లోటస్‌ఫాండ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఆ జిల్లాలో వైఎస్‌ అభిమానులు ఎక్కువగా ఉండడం వల్లే.. గతంలో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని తేలికగా కైవసం చేసుకున్నామని, ఇప్పుడు కూడా అక్కడి నుంచి బరిలోకి దిగితే తన తండ్రి అభిమానులు అంతా తన విజయానికి కృషి చేస్తారని ఆమె భావిస్తున్నారట. పైగా ఇటీవల కాలంలో అక్కడ నుంచి కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా వచ్చి తనను కలవడంతో ఆమె ఆశలు మరింత పెరిగాయట. పైగా ఆ జిల్లా నుంచి ఇద్దరు మాజీ ఎంపీలు కూడా తనకు సహకరిస్తారన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లా తను పెట్టబోయే పార్టీకి ఎక్కువ మద్దతుగా నిలుస్తుందన్న అంచనాలో జగనన్న బాణం ఉందని.. అందుకే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, ఇందులోనే అవకాశముంటే పార్టీ పేరును.. విధివిధానాలను కూడా అక్కడినుంచే ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఖమ్మం జిల్లా వైసీపీకి అండగా నిలిచినట్టు షర్మిల పార్టీకి కూడా అండగా ఉంటుందో లేదో చూడాలి మరి.!

You might also like

Leave A Reply

Your email address will not be published.