FbTelugu

రాజమండ్రి లో వైసీపీ ఇసుక దోపిడి: అయ్యన్న

విశాఖపట్నం: ఏపీలో ఇసుకను దోచేస్తున్నారని, రాజమండ్రి గోదావరి దగ్గర రోజుకి 2,500 లారీల ఇసుక లోడ్ అవుతోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

అకౌంట్ ఫర్ అయ్యేది మాత్రం కేవలం 600 లారీలేనన్నారు. స్థానిక వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆ ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. వైసీపీ నేతల స్వార్థం వల్ల రాష్ట్రంలో భవననిర్మాణ రంగం కుదేలైపోయిందన్నారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ కారణంగా లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన విమర్శించారు.

పాలనలో ప్రభుత్వాధికారులది కీలకపాత్ర అన్నారు. సంవత్సర కాలంగా వైసీపీ ప్రభుత్వం ఏ తప్పు చేసినా సరిదిద్దకుండా ఉద్యోగులు సమర్థిస్తున్నారు. డీజీపీని హైకోర్టు రెండు , మూడు గంటలు నిలబెట్టింది. చీఫ్ సెక్రటరీ, పంచాయితీరాజ్ సెక్రటరీ, కమిషనర్ లకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనలను చూసి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వానికి బయపడి తప్పులను సమర్థించవచ్చా అన్నారు.

మద్యపాన నిషేదమంటూ ఎన్నికల సమయంలో జగన్ మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక నాశిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పథకాల డబ్బులన్నీ తిరిగి బ్రాందీ షాపులకు వస్తున్నాయి. ఈతకాయంత ఇచ్చి గుమ్మడికాయంత తీసేసుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు దెప్పిపొడిచారు.

బ్రాందీ రేట్లు పెరగడం వల్ల గ్రామాల్లో నాటుసారా విక్రయిస్తున్నారు. అది తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో భూములు సేకరిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. రాజమండ్రి దగ్గర ఆవ భూముల సేకరణలో రూ. 150 కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు.

తక్కువ రేటుకు పేదల దగ్గర వైసీపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు భూములు కొట్టేస్తున్నారు. నర్సిపట్నం మండలంలో ఒకరి దగ్గర భూమి దగ్గర తీసుకుని మొత్తం డబ్బు ఇవ్వకుండా రూ. 12 లక్షలు కొట్టేశారు. ఇదేమని ప్రశ్నించిన నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడనని హెచ్చరించారు.

వలంటీర్ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి దానికీ వలంటీర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా వ్యాపారాన్ని వాలంటీర్లు చేస్తున్నారు. ముగ్గురు వలంటీర్లు కలిసి వైసీపీ నేతనే చంపేందుకు ప్రయత్నించారు. చెప్పిన మాట విననివారిని హత్యలు కూడా చేసే వ్యవస్థను వైసీపీ సిద్దం చేస్తోందని అయ్యన్న పాత్రుడు అన్నారు.

You might also like