FbTelugu

జగన్ జాబ్ క్యాలెండర్ మరిచారు: రఘురామ

న్యూఢిల్లీ: సిఎం వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి కు వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు నాలుగో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల హామీ నెరవేరలేదన్నారు.
ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంటుందని, జాబ్ క్యాలెండర్ హామీతో నిరుద్యోగుల నుంచి ఎన్నికల్లో మద్దతు లభించిందని గుర్తు చేశారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురుచూశారు కాని రాలేదు. ఏపి ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనే 8,402 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పశుసంవర్థక శాఖలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 18 వేల ఉపాధ్యాయ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. 6 వేల కానిస్టేబుళ్ల పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నా కొన్నేళ్ల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా వదిలేశారని రఘురామ తెలిపారు.

వందల సంఖ్యలో సెక్రటేరియట్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదు. 3 వేల పోస్టుల కోసం 2018-19లో ఏపిపిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది కాని కోర్టు కేసుల కారణంగా అంతంతమాత్రమే భర్తీ అయిందని వివరించారు. ఎన్నికల ప్రచార సందర్భంలో మెగా డిఎస్సి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఆశను ఇప్పటివరకు నెరవేర్చలేదని తెలిపారు. ఈ హామీలను అత్యవసరం కింద తీసుకుని వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఎంపి రఘురామ కృష్ణమరాజు సిఎం జగన్ ను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.