FbTelugu

యాదాద్రి పైకి నడిచే వెళ్లాల్సిందే

8 నుంచి దర్శనాలు, ఆర్జిత పూజలు

10 ఏళ్ల లోపు, 65 ఏళ్లు పైబడిన వారికి అనుమతి లేదు

యాదాద్రి ఈఓ ఎన్. గీత

యాదగిరి గుట్ట: భక్తుల రాకకోసం యాదగిరిగుట్ట సకల సౌకర్యాలతో సన్నద్ధమవుతున్నది.

ఈ నెల 8 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనంతో పాటు ఆర్జిత పూజల నిర్వహణ కోసం భక్తజనానికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కొండ కింద నుంచి భక్తులు కాలినడకన కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. కొండపైకి ఎలాంటి వాహనాలకు అనుమతించడం లేదు.  కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన స్వామి దర్శనాలు

ఈ నెల 8నుంచి పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం యాదాద్రిలో వివిధశాఖల అధికారులతో సమావేశమైన యాదాద్రి ఆలయ ఈఓ ఎన్‌. గీత ఏర్పాట్లపై సమీక్షించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కొండ కింది నుంచి పై వరకు కాలినడకన వెళ్లే భక్తులు భౌతికదూరం పాటించేలా గడులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

ముందుగా వారం పాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తామని ఆమె  చెప్పారు. యాదాద్రి కొండపై కరోనాకు ముందు.. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారమని, కానీ ఈ నెల 8 నుంచి ఒక్కో బ్యాచ్‌లో 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె వివరించారు.

శ్రీవారి కల్యాణం జరిపించుకునేందుకు గతంలో 200 మంది దంపతులను అనుమతించేవారమని, ఇకనుంచి 25 మంది దంపతులే కూర్చునేలా టికెట్లు ఇవ్వనున్నామని వెల్లడించారు. దర్శనాలు గత టైంటేబుల్‌ ప్రకారమే జరుగుతాయని ఆమె వివరించారు.

దర్శనాలకు పదేండ్ల లోపు పిల్లలు, 65 ఏండ్లు పైబడిన వృద్ధులకు అనుమతిలేదని ఈఓ గీత స్పష్టంచేశారు. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఆమె తెలిపారు.

You might also like