FbTelugu

జగన్ తో కలిసి పనిచేస్తా: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భంగం కలిగిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచన ఉండదని, పోరాడతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు

గోదావరి లో మిగులు జలాలు ఉన్నాయి వాడుకోండి, తరలించుకోండి అని అన్నానని ఆయన తెలిపారు. తాను చెప్పినట్లు వింటే సరిపోతుంది. కాదు లేదు అని వినకుంటే అనుభవిస్తారని, ఆ తరువాత ఊరుకునేది లేదన్నారు. ఏపీ సీఎం జగన్ తో ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నాం… కలిసే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మేము వివాదాలకు వెళ్లమని… ధైర్యం ఉన్న మనిషిని అని, ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రజలేనని… బుద్ధిమంతుల లాగా మంచి మాటే చెబుతా… వీళ్ల గురించి పట్టించు కోవద్దు అని ప్రజలు చెప్పారని కేసీఆర్ అన్నారు. గోదావరిలో ఇరు రాష్ట్రాలకు సరిపోను 1000 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి… వాడుకోండి అని చెప్పానని  అన్నారు. మాట్లాడితే బస్తీ మే సవాల్ అన్న చంద్రబాబు ఏమయ్యారని ఎద్దేవా చేశారు.

గోదావరి లో మా వాటా పోను ఇంకా 650 టీఎంసీల మిగులు జలాలు కావాలని కోరుతున్నాం. గోదావరి బేసిన్ లో మేమున్నామని, దాదాపు 500 కిలోమీటర్ల గోదావరి మా ప్రాంతంలో ప్రవహిస్తోందన్నారు. గోదావరి జలాలు ఎవరు వాడుకున్నా పర్వాలేదని చెప్పామన్నారు. నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, అడగడానికి ప్రతిపక్షం ఎవరని ఆయన ప్రశ్నించారు. పనికిమాలిన మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దన్నారు. సమైక్య  పాలకులకు సంచులు మోసింది ఎవరో తెలియదా అని అడిగారు.

కేంద్రం ప్యాకేజీ ఒక డొల్ల… బోగస్…

అన్ని రకాల ప్రపంచ స్థాయి జనరల్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తప్పు పడుతున్నాయని కేసీఆర్ అన్నారు. ఇది ఒక ఫ్యూడల్ విధానమని తూర్పారపట్టారు. ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే ఇవేమి షరతులు అని మండిపడ్డారు. రాష్ట్రాల చేతుల్లో నగదు రావాలని మేము అడిగితే బిచ్చగాళ్లను చేసిందని విమర్శించారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి ప్రజల నెత్తి మీద కత్తి పెడితే రూ.2000 కోట్లు అప్పులు ఇస్తారా అని నిలదీశారు. మార్కెట్ కమిటీల్లో కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలుచేస్తే, మున్సిపాలిటీల్లో పన్నులు పెంచితే మరో రూ.2000 కోట్లు ఇస్తారట అన్నారు. ఇంకా నాలుగు రంగాల్లో మూడింటిని అమలు పరిస్తే మరో రూ.5000 కోట్లు ఇస్తామని చెప్పారు. ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

మెడ మీద కత్తి పెట్టి సంస్కరణలు చేస్తే రూ.2000 కోట్లు బిక్షం వేస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. పాపం పండిన రోజు ఇలాంటి వారికి మూడుతుందని సీఎం కేసీఆర్ శాపనార్థాలు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.