FbTelugu

వామ్మో… న‌డిరోడ్డుపై వృద్దుడు మృతి…

హైద‌రాబాద్‌: కరోనా లక్షణాలున్న వ్యక్తి పట్ల కూడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఏడు పదులు దాటిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది. అయితే మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు వెనకడుగు వేశారు. కారణం ఏమంటే కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతోనే ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. స్థానికులు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎట్టకేలకు మృతదేహాన్ని తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నేపాల్ కు చెందిన బహదూర్ (70) సికంద్రాబాద్ లాలాపేట లో బార్ లో పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా దగ్గు, జ్వరం, జలుబు అధికంగా ఉండడంతో లాలాపేట ఆసుపత్రికి వెళ్లాడు. అతన్ని పరీక్షించిన తరువాత వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి అంబూలెన్స్ లో పంపించారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రికి పంపించారు.

అత‌న్ని పరీక్షించిన కింగ్ కోఠి ఆసుపత్రి వైద్యులు.. కరోనా లక్షణాలు ఉండడంతో తిరిగి గాంధీ కి వెళ్లాలని చెప్పారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ వృద్ధుడు గంటల తరబడి అక్క‌డే ఉన్నాడు. అంబులెన్స్ ఎంతకూ రాకపోవడం, దగ్గు ఎక్కువకావ‌డంతో నడుచుకుంటూ గాంధీ కి  బయలుదేరాడు.

మార్గ మధ్యలో నారాయణ గూడ శాంతి థియేటర్ వద్ద నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వృద్దుడు  అలాగే క‌ద‌ల‌కుండా ప‌డి ఉండ‌టంతో అనుమానం వచ్చిన స్థానికులు ఎదురుగా ఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లి తెలిపారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు ఆ వృద్ధుడి వివరాలు పరిశీలించారు. మృతుడి జేబులో ఆసుపత్రి స్లిప్స్ ఉండడంతో పోలీసులు ఖంగుతిని పక్కకు జరిగారు. ఈ విషయాన్ని గాంధీకి తెలియచేసి, దూరంగా ఒక పోలీసు కానిస్టేబుల్ ను బందోబస్తు కోసం నియమించారు. ప్రత్యేక వాహనంలో అతని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.

You might also like