FbTelugu

వైరస్‌ సోకకుండానే..

కరోనా వైరస్‌ ఇప్పుడు మనిషి శరీరంలోకి చేరి వారిని చంపడమే కాదు. మనిషికి సోకకుండా కూడా చంపేస్తుంది. వారి ప్రాణాలు వారే తీసుకునేలా చేస్తోంది. ఇలాంటి ఆత్మహత్యల పరంపర నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.

కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడి వ్యాపారాలు అక్కడే పడకేశాయి. చిన్న వ్యాపారుల నుంచి రోజు కూలీల వరకు దమ్మిడీ ఆదాయం లేదు. దీంతో వారి కుటుంబాలు గడవడం కష్టమైంది. అందరి పరిస్థితీ ఇదే కావడంతో అప్పిచ్చే నాథుడు కూడా కరువయ్యాడు. ఈ నేపథ్యంలో వారి జీవితాల్లో ఆకలి అనే వైరస్‌ ప్రవేశించింది. తినడానికి తిండిలేక పేగులు మెలిపెట్టాయి. దాతలు ఇచ్చే అన్నం దొరికితే తినడం లేకుంటే పస్తులుండడం.

దాతల భోజనం తీసుకునేందుకు కొందరి మనసు ఒప్పుకోలేదు. తినడానికి తిండిలేక.. కుటంబం పడే కష్టాలు చూడలేక ఆత్మహత్యల బాట పట్టారు. వారికి తెలియకుండానే ఇలా కరోనా వైరస్‌.. వారి ఊపిరి తీసింది. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తెలంగాణలో ఇప్పటికే అనేకమంది ఆత్మహత్యల బాట పట్టారు. ఇంకా ఆ దారిని ఎంచుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇల్లు గడవడం కష్టంగా ఉంది దానిని అమ్మేద్దామని ఓ కొడుకు మాటకు తల్లి ఒప్పుకోలేదు. దీంతో కొడుకు ఆ తల్లిని దారుణంగా చంపాడు. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా నర్సింగభట్ల గ్రామంలో జరిగింది. ఇలా కరోనా ప్రభావం ఆత్మహత్యల నుంచి హత్యల దాకా వెళ్లిందన్న ప్రచారం సాగుతోంది. ఈ కరోనా ఇంకా ఎన్ని ప్రాణాలను బలి తీసుకుంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You might also like