FbTelugu

కరోనా వస్తేనే ఆదుకుంటారా?

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ వందకు పైగానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనా నియంత్రణలో భాగస్వామ్యమైన వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే, కరోనా కట్టడిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం అనేక రకాలుగా అండగా నిలిచింది. బీమా పాలసీ కూడా అమలు చేస్తోంది. కానీ, అదే పనిచేస్తున్న జర్నలిస్టులను మాత్రం గాలికి వదిలేసింది. కరోనా కారణంతో ఇప్పటికే తెలంగాణలోని ప్రధాన పత్రికలతో పాటు అన్ని పత్రికలు, చానల్స్‌ సగంమంది జర్నలిస్టుల ఉద్యోగాలు తీసేసి ఇంటికి పంపాయి.

మిగతా వారికి కూడా 30 నుంచి 60శాతం వరకు జీతాల్లో కోతలు విధించాయి. పైగా కార్యాలయాల్లో కనీస రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో జర్నలిస్టులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం కరోనా బారిన పడిన వారి మధ్య తిరగాల్సిన జర్నలిస్టులను అటు ప్రభుత్వం, ఇటు పత్రిక యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికే హైదరాబాద్‌ నగరంతో పాటు జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, సిద్దిపేటలాంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు కరోనా బారిన పడినట్టు సమాచారం. ఇంకా అనేకమంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.

కరోనా బారిన పడిన కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అందుకే మిగిలిన రంగాల్లోలాగానే జర్నలిస్టులను కూడా ఆదుకోవాలని ఎన్నోసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. జర్నలిస్టు సంఘాలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. పైగా పత్రిక కార్యాలయాల్లో ఉద్యోగాలు తీసేశారా.. పూర్తి వేతనం ఇవ్వడం లేదా అని విలేకరుల సమావేశంలో అమాయకంగా ప్రశ్నించిన సీఎం.. దానిపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పకుండా రేపు మా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేయండి అని ఉచిత సలహా ఇచ్చి వదిలేశారు.

కానీ, ఇప్పుడు పరిస్థితి చేయి దాటింది. ఒక్కొక్కరుగా జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారినందరినీ ఆదుకోవాల్సింది పోయి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కరోనా సోకిన జర్నలిస్టుల బ్యాంకు అకౌంట్లలో పదివేల రూపాయలు వేశామని, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం హర్షణీయమే. కానీ, జర్నలిస్టుల్లో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే.. కరోనా సోకితే తప్ప జర్నలిస్టులకు పదివేల రూపాయల సాయం ఇవ్వరా అని. అకాడమీ నుంచి పదివేల రూపాయల సాయం తీసుకోవాలంటే కరోనా వ్యాధి బారిన పడాల్సిందేనా అన్న అనుమానాలు జర్నలిస్టులను వేధిస్తున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం, తెలంగాణ మీడియా అకాడమీ శ్రద్ధ తీసుకొని జర్నలిస్టులను ఆదుకోవాలని, వారికి రక్షణ పరికరాలు సమకూర్చాలని, పత్రికా కార్యాలయాల్లో కూడా కరోనా రక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జర్నలిస్టులు కోరుతున్నారు. లేకుంటే జర్నలిస్టులు కూడా కరోనా కాటుకు బలికాక తప్పదన్న భయంలో ఉన్నారు.

You might also like