FbTelugu

వారి మధ్య విమర్శలు అందుకేనా..?

తెలంగాణలో టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మిత్రపక్షంగా ఉంటున్నాయి. వారి మధ్య స్నేహం ఎప్పటినుంచో ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంఐఎం దానితో మిత్రపక్షంగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో మిత్రత్వం చేస్తోంది. ఎంఐఎం తమకు సహజ మిత్రుడని స్వయంగా కేసీఆర్‌ కూడా చెప్పారు. వారిద్దరి మధ్య గాలి దూరనంత దగ్గర సంబంధం ఉందన్న విషయం మఅందరికీ తెలిసిందే. కాకుంటే, ఎన్నికల్లో మాత్రం ఒక అవగాహనతో పోటీ చేస్తుంటారు. టీఆర్‌ఎస్‌ గెలవాల్సిన చోట ఎంఐఎం బలహీన అభ్యర్థిని పోటీకి దింపడం, దీనికి బదులుగా పాతబస్తీలో ఎంఐఎం విజయానికి టీఆర్‌ఎస్‌ బలహీన అభ్యర్థిని బరిలోకి దింపడం లాంటి రాజకీయ జిమ్మిక్కులు చేస్తుంటారు.

కానీ, ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి వారి విమర్శలు చూస్తే ఈ రెండు పార్టీల మధ్య చెడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. పైగా ఈ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు లేదని ఈ రెండు పార్టీలూ ప్రకటించాయి. ఒక దశలో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్‌ సర్కారు పడిపోతుందని చెప్పారు. కేటీఆర్, కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు కూడా మండిపడ్డారు. కేటీఆర్‌ బచ్చానో.. బడానో ఆయన రోడ్‌షోలకు వచ్చే జనాన్ని చూస్తే తెలుస్తుందని, కేవలం ఏడు ఎమ్మెల్యే స్థానాలున్న ఎంఐఎం తమ సర్కారును పడగొడతామని చెప్పడం నవ్వు తెప్పిస్తోందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ హెచ్చరించారు. ఈ సినిమా అంతా చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైందని అనిపిస్తుంది కదూ.. కానీ, రాజకీయ పండితులు మాత్రం ఇదంతా రాజకీయ జిమ్మిక్కు అని కొట్టి పడేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎంఐఎం, బీజేపీ అన్నట్టుగా సాగుతాయని, ఈ పరిస్థితుల్లో ఎంఐఎంను దగ్గరకు తీసుకుంటే హిందువుల ఓట్లకు దూరమవుతామని భావించి టీఆర్‌ఎస్‌ ఈ ఎత్తుగడ వేసిందని అభిప్రాయపడుతున్నారు. పైగా ఇటీవల కాలంలో దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను చావుదెబ్బ కొట్టిన బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దూసుకుపోవడాన్ని అడ్డుకోవాలంటే ఇదే సరైన మార్గమని టీఆర్‌ఎస్‌ భావించిందని, దీనిని అమలు చేయడం కోసమే ఇటీవల కేసీఆర్‌తో ఎంఐఎం బాస్‌ సమావేశం కూడా అయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి, వీరి పాచిక ఏ మేరకు పారుతోందో తేలాలంటే వచ్చే నెల నాలుగో తేదీ దాకా ఆగాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.