FbTelugu

వారి వ్యూహం బెడిసి కొడుతుందా..

దుబ్బాక పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న టీఆర్‌ఎస్‌ నేతల వ్యూహం మరోసారి బెడిసికొట్టనుందా..? బీజేపీని నిలువరించేందుకు వేస్తున్న పాచికలు పారేలా కనిపించడం లేదా..? వారి ఆలోచనలకు మించిన స్థాయిలో కమలనాథులు ప్లాన్‌ వేస్తున్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది రాజకీయ పండితుల నుంచి. దుబ్బాక ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించింది బీజేపీ.

అధికార టీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపిక కంటే ముందే అసమ్మతి బయటకు వచ్చింది. వారిని బుజ్జగించేందుకే పార్టీ నేతలకు సమయం సరిపోయింది. చివరకు అది పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యానికి కారణమైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించేలోపుగానే బీజేపీ అభ్యర్థి ఒకసారి నియోజకవర్గమంతా కలియ తిరిగారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఇది బాగా కలిసివచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన టీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్త వ్యూహానికి తెరలేపింది. వాస్తవానికి ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరగాలి. అంతా అప్పుడే జరుగుతాయని భావించారు. కానీ, ఎదుటి పార్టీ వారికి ఎన్నికలకు సిద్ధమయ్యే సమయం ఇవ్వకుండా చేయాలని, అందుకే డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ వేసింది. దీనికనుగుణంగానే సిటీవాసులకు అనేక రకాల తాయిలాలు ఇప్పటికే అందిస్తోంది. ఈ తాయిలాలు ప్రజలకు అందిన వెంటనే ఎన్నికలు జరిగితే ఓట్లన్నీ తమకే పడతాయని గులాబీ నేతలు ఆలోచించారు. దీంతో ఎదుటి పార్టీ వారికి అభ్యర్థిని ఎంపిక చేసుకునేందుకే సమయం చాలక ఇబ్బందులు పడతారని భావించిందట. కానీ, ఇటీవల దుబ్బాకలో విజయంతో జోరుమీదున్న బీజేపీ ఈ విషయాన్ని ముందే గ్రహించిందట. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే కార్పొరేటర్‌ అభ్యర్థులను నిర్ణయించిందట.

వాస్తవానికి ఏడాది క్రితమే అభ్యర్థులను నిర్ణయించి వారి వార్డుల్లో ప్లాన్‌ చేసుకోవాలని చెప్పినట్టు ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు ఇతర పార్టీల నుంచి ఎవరైనా ముఖ్యులు బీజేపీలోకి వస్తే.. వారికి ఇవ్వాల్సిన టికెట్ల విషయంలో అంటే ఒకటి రెండు చోట్ల అభ్యర్థుల మార్పు ఉంటుంది తప్ప మిగతా వార్డులన్నింటిలోనూ ఇదివరకు ఎంపిక చేసిన వారికే టికెట్లు ఖాయమని పార్టీ పెద్దలు కూడా చెప్పారట. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన రావడమే ఆలస్యం కదనరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ విషయం టీఆర్‌ఎస్‌ నేతలకు మింగుడు పడడం లేదట. తాము ఎంత పకడ్బందీగా ప్లాన్‌ వేసినా.. బీజేపీ వారు అంతకుముందే దానిని అమలు చేస్తున్నారని తెలిసి తలలు పట్టుకుంటున్నారట. చివరకు జీహెచ్‌ఎంసీలో విజయానికి వేసిన ముందస్తు ఎన్నికల ఎత్తుగడ కూడా చిత్తయ్యేలా ఉందని టీఆర్‌ఎస్‌ పెద్దలు బుర్రలు గోక్కుంటున్నారట.

You might also like

Leave A Reply

Your email address will not be published.