FbTelugu

ఏపీలో సీన్‌ రిపీట్‌ అవుతుందా..?

ఏపీలో ఇప్పుడు సీన్‌ రిపీట్‌ అవుతుందా..? జగన్‌ నిర్ణయానికి మళ్లీ బ్రేకులు పడ్డాయా..? జగన్‌ ప్రభుత్వం ఆలోచనలకు కోర్టులు అడ్డుపడుతున్నాయా..? అసలు ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు ఎందుకు అడ్డుకుంటున్నాయి..? జగన్‌ సర్కారు అంతగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజలను ఆలోచనల్లో పడేస్తున్నాయి. ఎక్కడ చూసినా రాజకీయ విశ్లేషకులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇదే అంశాన్ని జోరుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు సుమారు 60 సార్లకు పైగా మొట్టికాయలు వేసింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంపైనేతే ఏకంగా నిప్పులు చెరిగింది. నిమ్మగడ్డను వెంటనే బాధ్యతల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. దీనికి జగన్‌ సర్కారు ససేమిరా అనడంతో చివరకు గవర్నర్‌ కోర్టులోకి బంతిని వేసి ఆయన ద్వారా నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించేలా చేసింది. వాస్తవానికి నిమ్మగడ్డను పదవినుంచి తొలగించడాన్ని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి.

జగన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం కోర్టులో నిలబడదని కూడా చెప్పాయి. కానీ, ఏపీ సర్కారు వినలేదు. చివరకు విపక్షాలు చెప్పినట్టే జరిగింది. తిరిగి నిమ్మగడ్డను కుర్చీలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి జగన్‌కు ఎదురైంది. ఈ వివాదం సర్దుమణిగిన రోజే జగన్‌ ప్రభుత్వం మరో వివాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్‌తో ఆమోదముద్ర వేయించారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీ బిల్లు రద్దుపై గెజిట్‌ కూడా ఆగమేఘాల మీద విడుదల చేయించారు.

దీనిపై కూడా విపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే ఈ విషయంపై అనేక పిటిషన్లు కోర్టులో ఉన్నాయని, రాష్ట్ర విభజన చట్టంలో కూడా రాష్ట్ర రాజధాని అని అన్నారు కానీ, రాజధానులు అనలేదని.. మూడు రాజధానుల అంశం దీనిలో లేదని విపక్షాలు వాదిస్తున్నాయి. హైకోర్టును కూడా అమరావతిలో కాకుండా కర్నూలులో ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారని, అయితే, హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్రం, గవర్నర్‌ పరిధిలో లేదని.. అది కేంద్రం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని.. దీంతో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ చెల్లదని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. ఈ దశలోనే మూడు రాజధానుల అంశంపై హైకోర్టు జోక్యం చేసుకుంది. కోర్టుకు వచ్చిన పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీ బిల్లు రద్దు, గవర్నర్‌ గెజిట్‌పై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. మూడు రాజధానుల గెజిట్‌ నిలిపివేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు రిప్లై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తర్వాత విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాస్థితిని కొనసాగించాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు, విపక్షాలు మాత్రం మళ్లీ నిమ్మగడ్డ తీర్పే రిపీట్‌ కాబోతుందని, రాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడం ఖాయంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే జగన్‌ సర్కారుకు ఇది పెద్ద దెబ్బే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

You might also like