FbTelugu

వారికి నిరాశేనా..?

ఇటీవల కాలంలో తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీకి నిరాశ తప్పడం లేదా..? వారి అంచనాలు తలకిందులవుతున్నాయా..? ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..? తమ దూకుడుకు కళ్లెం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఇలాంటి ఆలోచనలతో తెలంగాణ కమలనాథులు బిజీబిజీగా ఉన్నారట. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను చావుదెబ్బతీసి కమలం గుభాళించింది. వెంటనే వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మరింత దూకుడు పెంచింది.

ఈ దూకుడును ఇలాగే పెంచుకుంటూ పోతే వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమాలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో తమ ఓటు గణనీయంగా పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనం తమవైపే ఉన్నారన్న సంకేతాలు వస్తే ఇక తమ విజయం నల్లేరుపై నడకేనని భావించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సత్తాను నిరూపించుకునే అవకాశం నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక రూపంలో బీజేపీకి కలిసి వచ్చింది. నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఇక్కడ బీజేపీకి మొదటి నుంచీ పెద్దగా బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి ఇక్కడ రెండు వేలకు మించి ఓట్లు రాలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యంపైనే కన్నువేశారు. ఇక్కడ బలమైన రాజకీయనేత జానారెడ్డి కుటుంబంపై కమలనాథులు దృష్టి నిలిపారు. జానారెడ్డిని కానీ, ఆయన కుమారుడిని కానీ బీజేపీ తరఫున బరిలోకి దింపాలని ఆశించారు. ఆమేరకు మీడియాకు లీకులు కూడా వచ్చాయి. జానా కానీ ఆయన కుమారుడు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.

కానీ, జానారెడ్డి కేరళ పర్యటన నుంచి వచ్చీ రాగానే చేసిన ప్రకటన కమలనాథుల గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా మారింది. తమతో ఎవరూ మాట్లాడలేదని, తాము పార్టీ మారటం లేదని చెప్పారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో తన కుమారుడు బరిలోకి దిగుతాడని కూడా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవేళ సాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించకుంటే ఇప్పటి వరకు తమకు ఉన్న భూమ్‌ ఒక్కసారిగా పడిపోయే పరిస్థితులు వస్తాయేమోనన్న భయాందోళనలో ఉన్నట్టు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా చివరి వరకు జానాను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉండాలని కమలనాథులు నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే జానారెడ్డికి గవర్నర్‌ పదవి, ఆయన కుమారుడికి సాగర్‌ బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఆఫర్‌ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే జానారెడ్డి తాను గానీ, తన కుమారుడు గానీ పార్టీ మారడం లేదని, చివరి వరకూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటామని క్లారిటీ ఇచ్చినా.. బీజేపీ మాత్రం రకరకాల ఆఫర్లతో జానాను తమ దళంలో చేర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి సాగర్‌లో జానా తమ పార్టీలోకి వస్తాడని, అక్కడ సీటును తాము గెలుస్తామన్న బీజేపీ నేతల ఆశలు నెరవేరుతాయా లేదా అన్న విషయం కూడా తేలనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.