FbTelugu

ఆ ఎమ్మెల్యే అరెస్టు తప్పదా..?

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, ఇప్పుడు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఇప్పటి వరకు ఆయనపై చర్య తీసుకోవడానికి పోలీసులు సైతం వెనుకడుగు వేశారు.

కానీ, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను కాపాడడం వారివల్ల కూడా కావడం లేదు. నేడో, రేపో ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నట్టు అధికారవర్గాల భోగట్టా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. నిత్యం జనంలో ఉండే ఆయన ఇప్పుడు ఓ కేసు విషయంలో అరెస్టు కాబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇటీవల కాలంలో యాచారం మండలంలో రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. తీరా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుండగా స్థానిక ఎంపీపీ సుకన్య అక్కడకు చేరుకొని తన మండలంలో తనకు సమాచారం లేకుండా ప్రభుత్వ కార్య్రకమాలు ఎలా నిర్వహిస్తారంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కొబ్బరికాయ కొట్టకుండా ఎంపీపీ చేయి అడ్డుపెట్టారు. అయినా, ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టడంతో ఎంపీపీ చేతికి గాయమైంది. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. వాస్తవానికి సుకన్య బీజేపీలో చురుకైన నాయకురాలు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకున్నా అక్కడ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ సభ్యులు బీజేపీకి చెందిన సుకన్యకు ఎంపీపీ పీఠం అప్పగించారు.

అయితే, ఇటీవల ఎమ్మెల్యేతో జరిగిన ఘర్షణతో ఎంపీపీకి గాయం కావడంతో బీజేపీ రాష్ట్ర నేతలు ఆమెకు మద్దతుగా గట్టిగా నిలబడ్డారు. పార్టీ రాష్ట్రచీఫ్‌ బండి సంజయ్ కూడా ఆమెను పరామర్శించారు. అయితే, ఎంపీపీ సుకన్య ఎమ్మెల్యే, ఇద్దరు పోలీసు అధికారులు తనపై దాడికి దిగారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందినవారు కావడంతో అతడిపై చర్య తీసుకోవడానికి కాస్త వెనుకడుగు వేశారు. అయితే, బీజేపీ నేతలు గట్టిగా పట్టుబట్టడంతో పాటు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడు రాములు కూడా పోలీసు అధికారులను గట్టిగా ఆదేశించడంతో ఇప్పుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు స్థానిక పోలీసులు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ రాత్రిగానీ, రేపు ఉదయం గానీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశాలున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది.

You might also like