FbTelugu

జగన్ పేషీలోకి శ్రీలక్ష్మీ వస్తుందా..!

అమరావతి: తెలంగాణ నుంచి ఏపీ సర్వీసుకు పట్టుబట్టి వచ్చిన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మీ పోస్టింగ్ ఖరారైందని అంటున్నారు. అమెను సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పేషీలోనే నియమించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) శ్రీలక్ష్మీని ఏపీ సర్వీసుకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమెను రిలీవ్ చేసింది. వెంటనే వెళ్లి ఆమె ఏపీ ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) లో రిపోర్టు చేసింది. ఆమెను ఎక్కడ నియమిస్తారనే దానిపై బ్యూరోక్రాట్ వర్గాలతో పాటు రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆమె జైలు జీవితాన్ని అనుభవించారు. జైలు జీవితం కారణంగా ఆమె ఆరోగ్యపరంగా చిక్కిపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె తిరిగి సర్వీసులో చేరతారా లేదా అనే పరిస్థితికి వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె క్రమంగా కోలుకున్నారు. ఏపీ ప్రాంతానికి చెందిన ఆమెను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్వీసుకు కేటాయించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చే వరకు వేచి చూసిన ఆమె, ఏపీ కి డిప్యూటేషన్ పై వెళ్లేందుకు ప్రయత్నించారు. కేంద్రం ససేమిరా అనడంతో ఆమె క్యాట్ ను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకుని ఏకంగా ఏపీ సర్వీసుకు వెళ్లిపోయారు. ఆమె ను తొలుత వైద్య ఆరోగ్య శాఖలో నియమిస్తారని ప్రచారం జరిగినప్పటికీ జగన్ పేషీలో నియమితులయ్యే అవకాశాలే ఉన్నాయి.

శ్రీలక్ష్మీ గతంలో జైలుకు వెళ్లిన నేపధ్యంలో ఆమె ఏ శాఖాదిపతిగా మనశ్శాంతిగా పని చేయలేరనేది జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ ఆమెను ఏ శాఖాదిపతిగా నియమించినా.. అక్కడ పనిచేసే కింది స్థాయి అధికారులు ఉద్యోగులు, హెచ్‍ఓడీల ఉద్యోగులు, అదికారులు, వివిధ జిల్లా, మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు ఆమె పట్ల చిన్నచూపు చూసే ప్రమాదముందని పసిగట్టారు. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉంది కూడా. మా శాఖాదిపతికి ఐఎఎస్‍ అధికారి అనుభవం కన్నా.. జైలు అనుభవమే ఎక్కువగా ఉందని వ్యగ్యంగా చెప్పుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలక్ష్మీని తన కార్యాలయంలో నియమించుకుంటే.. ప్రశాంతంగా ఆమె పని చేయగలుగుతారని సీఎం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇవన్నీ గమనించిన జగన్ తన కార్యాలయంలో నియమించుకుంటే.. ఇబ్బంది లేకుండా పనిచేయవచ్చునని శ్రీలక్ష్మీ భావిస్తున్నట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.