FbTelugu

గ‌న్న‌వ‌రం రాజ‌కీయానికి తెర‌ప‌డెదెపుడో?

నిన్న‌టి వ‌ర‌కూ గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం హాట్‌టాపిక్‌. దాదాపు నెల‌రోజుల పాటు ఎన్నో ట‌ర్నింగ్‌లు. పార్టీ నేత‌ల హ‌డావుడి.. వైసీపీ, టీడీపీలో ఏం జ‌రుగుతుంద‌నే అయోమ‌యం. అబ్బో అదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లెక్క‌న సాగింది. మ‌రి ఇప్పుడు ఏమైంది.. అక్క‌డ నిశ్చ‌బ్దం ఎందుకు రాజ్య‌మేలుతోంది. వ‌ల్ల‌భ‌నేని వంశీ మ‌న‌సు మార్చుకున్నాడా.. వైసీపీ నేత యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ఏమైనా అల్టిమేటం జారీచేశాడా. లేక‌పోతే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇద్ద‌రి మ‌ద్య స‌యోద్య కుదిర్చారా! అస‌లు ఇంత‌కీ అక్క‌డ ఏం జ‌రుగుతోంది. ఇదీ ఇప్పుడు గ‌న్న‌వ‌రంలోనే కాదు.. కృష్ణాజిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌నే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని సీఎం జ‌గ‌న్‌ను క‌లిశాడు. అప్ప‌టికే వంశీ వైసీపీలోకి జంప్ చేస్తారంటూ జ‌రిగే ఊహాగానాల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చాడు. ఆ త‌రువాత టీడీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే ప‌ద‌వికీ రాం..రాం చెబుతాడ‌నే ప్రచారం జ‌రిగింది. ఆ త‌రువాత కొన‌క‌ళ్ల‌, కేశినేని వంటి పెద్ద‌లు చంద్ర‌బాబు సూచ‌న‌తో వంశీతో చ‌ర్చ‌లు జ‌రిపినా తూచ్ నా నిర్ణ‌యం మార‌దంటూ వ‌ల్ల‌భ‌నేని గ‌ట్టిగానే బ‌దులివ్వ‌టంతో.. టీడీపీ సీనియ‌ర్లు.. పోతేపోనీ వంశీ లాంటి ఒక్క‌రిద్ద‌రు పార్టీను వీడినా న‌ష్టమేం లేదంటూ పెద‌వి విరిచారు.

ఆ త‌రువాత అటు నుంచి వైసీపీ త‌ర‌పున పోటీచేసి ఓడిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు అండ్ వ‌ర్గం కూడా.. వంశీను వైసీపీలోకి తీసుకుంటే తాను కూడా పున‌రాలోచించాల్సి ఉంటుందంటూ వైసీపీకు అల్టిమేటం జారీచేశాడు. త‌మ‌పై కేసులు పెట్టించి.. కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందిపెట్టిన వ‌ల్ల‌భ‌నేని వైసీపీలోకి వ‌స్తే త‌మ ప‌రువు పోతుందంటూ జ‌గ‌న్ ఎదుట ఏక‌ర‌వు పెట్టిన‌ట్టు కూడా తెలుస్తోంది. ఇటువంటి సందిగ్థ ప‌రిస్థితుల్లో వ‌ల్ల‌భ‌నేని ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది. కానీ ఇది జ‌రిగి 20 రోజులు కావ‌స్తున్నా వంశీ మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించ‌లేదు. అంటే దీని అర్ధం.. కొద్దికాలం వేచిచూద్దామ‌నా.. ప‌ద‌వి దూర‌మైతే కోరి క‌ష్టాలు కొనితెచ్చుకుంటాన‌నే ముందుచూపా!

Tags:
You might also like