FbTelugu

ఎన్నికలు జరిగేనా..?

హైదరాబాద్‌లో భారీవర్షం ప్రభావం త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పడనుందా..? హైదరాబాద్‌ మునకతో టీఆర్‌ఎస్‌పై నగరవాసుల్లో వ్యతిరేకత మొదలైందా…? ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే నిండా మునుగుతామని గులాబీ నేతలు భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నెల 13 నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ నిండా మునిగింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసర వస్తువులతో పాటు అన్నీ మునిగిపోయాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా పనికిరాకుండా పోయాయి. కనీసం తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు కూడా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం సాయం చేసేవారే కరువయ్యారు. చాలామంది రోగుల మందులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి.

దీంతో చాలామందికి వ్యాధుల తీవ్రత పెరిగిపోతోంది. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చుట్టపుచూపుగా వచ్చి చూసి పోవడం తప్ప సాయం మాత్రం చేయడం లేదు. దీంతో అధికార పార్టీపై నగరవాసులు గుర్రుగా ఉన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కార్పొరేటర్లను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నాలాలు ఆక్రమించుకుంటున్నారని.. వాటిపై నిర్మాణాలు చేపట్టకుండా ఆపాలని స్థానికులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కార్పొరేటర్లు పట్టించుకోలేదు. వాస్తవానికి నాలాలు కబ్జా చేసిన వారిలో టీఆర్‌ఎస్‌ నేతల పాత్రే ఎక్కువగా ఉంది. ఇలా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్ల నిర్లక్ష్యంతోనే హైదరాబాద్‌ మునిగిందన్న నిర్ణయానికి జనం వచ్చారు.

ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలపై కన్నెర్ర చేస్తున్నారు. హయత్‌నగర్‌ కార్పొరేటర్‌పై ఏకంగా దాడికే దిగారంటే అధికార పార్టీపై నగరవాసుల్లో ఎంత కోపం ఉందో అర్ధం అవుతుంది. దీంతో ఇప్పుడు జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని అంచనాకు వచ్చిన స్థానిక నేతలంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. పార్టీ పెద్దలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతుండడంతో ఎన్నికలు వాయిదా వేస్తేనే మంచిదేమో అన్న ఆలోచనలో ఉన్నారట. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.