FbTelugu

ఎందుకంత సీక్రెట్‌ ?

కరోనా ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. భారత్‌లో అది నెమ్మదిగా ప్రారంభమైనా మెల్లగా వేగాన్ని పెంచింది.

శుక్రవారం ఉదయం 8 గంటల వరకే దేశంలో దాదాపు 82వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. కరోనాతో ఇప్పటికి మూడువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఈ వైరస్‌ బయటపడిన చైనాకంటే ఎక్కువ కేసులు మనదేశంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా భారత్‌ అతలాకుతలమైంది. పేదల ఉపాధి ఆగిపోయింది.

తినడానికి తిండికూడా లేక వలస కార్మికులు కాలినడకన ఇంటిబాట పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నార్తులకు సాయమందించేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వచ్చాయి. వారంతా బాధితులకు ఎంతోకొంత ఆసరాగా నిలిచారు. అలాంటి వారి నుంచి సాయం తీసుకునేందుకు భారత ప్రభుత్వం పీఎం కేర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని అనేకమంది స్పందించి ఈ పీఎం కేర్స్‌కు విరాళాలు అందజేశారు.

వంద రూపాయల నుంచి రూ.వందల కోట్ల వరకు ఈ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ నిధులను కరోనా బాధితులకు సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తారన్న నమ్మకంతో వారంతా ఈ విరాళాలు అందజేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిని అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఇప్పుడు దీనిపైనే చర్చంతా సాగుతోంది. అసలు విరాళాలు ఎన్ని వచ్చాయో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఈ వివరాలను చెప్పాలని పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అడిగినా సమాధానం లేదు. పైగా వాటి వివరాలను వెల్లడించలేమని చెప్పారు. దీంతో ఈ విరాళాలపై దేశంలోని ప్రజలందరికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు విరాళాల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఎంతమొత్తం వచ్చింది?. ఆ వచ్చిన నిధులను దేనికోసం వాడుతున్నారు?. ఖర్చు చేసిన నిధులను ఎవరు ఆడిట్‌ చేస్తారు?. అసలు ఇవన్నీ జరుగుతాయా?.. లేదా.. అందులో భారీ మొత్తంలో పక్కదారి పట్టే ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా అన్న అనుమానాలు దేశవాసులతో పాటు విరాళాలు ఇచ్చిన వారిని కూడా వేధిస్తున్నాయి. దాతలు ఇచ్చిన విరాళాలను అంతగా దాచిపెట్టాల్సిన అవసరం ఏముందని రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం ఆ వివరాలను బయటపెట్టాలని దేశప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

You might also like