FbTelugu

బీజేపీ సీఎం తో కేసీఆర్ భేటీ ఎందుకో?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీలో సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ తో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు సుధీర్ఘంగా సమావేశమయ్యారు. బుధవారం జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారనేది బయటకు పొక్కనివ్వడం లేదు.

తన భార్య వైద్య పరీక్షల కోసం సీఎం చౌహాన్ హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ ఎదురుగా ఉన్న ఒక స్టార్ హోటల్ లో చౌహాన్ కుటుంబం బస చేసింది. మొన్న రైతుల ఆందోళన వరకు సంఘీభావం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. అప్పటి నుంచి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఏమాత్రం దూకుడు తగ్గించకుండా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో వ్యక్తిగతంగా భేటీ కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. వీరిద్దరి మధ్య మధ్యప్రదేశ్ రాజకీయాలు, రైతుల ఆందోళన అని బయటకు పొక్కుతున్నా, చర్చల సారాంశం వేరేగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ లు కలహించుకుని ఢిల్లీలో భాయ్ భాయ్ అనే రకంగా వ్యవహరిస్తున్నారనేది కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి, శ్రద్ధ ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయేదని, ఆయన కుటుంబం జైలులో ఉండేదని అంటున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత, జీహెచ్ఎంసీ ప్రచారంలో బీజేపీపై యుద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ చివరి వారంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని ప్రగల్భాలు పలికారు. గ్రేటర్ లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుని టీఆర్ఎస్ ను సవాల్ చేసే స్థితికి వచ్చింది. దీంతో కేసీఆర్ రెండో ప్లాన్ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. డిసెంబర్ 11వ తేదీన వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ను కలిసి వచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని, చౌహాన్ తో భేటీ కావడం కూడా వేర్వేరుగా చూడలేమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

తాజాగా గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి అన్నీ అనుమతులు ఇచ్చేసింది. దీంతో నూతన సచివాలయం నిర్మించుకునేందుకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. కాంగ్రెస్ నాయకులు, పర్యవరణ వేత్తలు అందించిన ఫిర్యాదులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా కేసీఆర్ కు అనుకూలంగా అనుమతులివ్వడంతో రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనే దానికి సంకేతమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.