FbTelugu

జగన్ కాళేశ్వరం ఎందుకెళ్లాడో చెప్పాలి: విష్ణు డిమాండ్

తాడిపత్రి: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణకు వెళ్లిన సీఎం జగన్ కు ఆ ప్రాజెక్టు గురించి నేడు ఫిర్యాదు చేసే అర్హత ఉందా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

రాయలసీమ ప్రాజెక్టుల  విషయంలో రాష్ట్రప్రభుత్వం వైఖరిని అనుమానించాల్సి వస్తుందన్నారు. జగన్ రెడ్డి, కేసీఆర్ నిత్యం హాట్ లైన్ లో మాట్లాడుకుంటూ, టీవీల్లో  తిట్టుకుంటూ ప్రజల ముందు నటిస్తున్నారన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ పోతిరెడ్డి వివాదం పేరుతో రెండు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ నీటి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వకపోతే చరిత్రలో సీమ ద్రోహిగా నిలిచిపోతారని అన్నారు. మీ పార్టీ వైఖరి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలో పార్టీల వైఖరి ప్రకటించాలన్నారు.

తెలంగాణ నేతలను, పార్టీలను చూసి కనీసం సిగ్గు తెచ్చుకోండని హితవు పలికారు. మేము అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి  ఓట్లు వేయించుకున్న జగన్, నేడు మోసం చేసి బిల్లులు పెంచారని ఆయన విమర్శించారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే అదేనా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను ముంచడమే వైఎస్ఆర్ ప్రభుత్వానికి పనిగా మారిందన్నారు.

ప్రజలకు నవరత్నాల ద్వారా డబ్బులు ఇస్తున్నానని ఒక వైపు చెప్పుకుంటూ… మరో వైపు విద్యుత్, మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బులు లాక్కుంటున్నదని విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like