ఇండియాలో కరోనా నానాటికీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో 79వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ వీటి సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలించడంతో పాటు అత్యంత జనతాకిడి ఉండే మద్యం దుకాణాలు తెరిచారు. ప్రజా రవాణా వ్యవస్థను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలు కూడా సాగుతున్నాయి. విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులను గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపే అవకాశముంది.
కానీ, రైళ్లలో వచ్చే వారిని క్వారంటైన్‌కు పంపడం చాలా కష్టం. ఇప్పటికే వలస కూలీలను సొంత ప్రాంతాలకు అనుమతిస్తున్న క్రమంలోనే అనేక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలు కూడా పునరుద్ధరిస్తే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఏపీకి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. ప్రధానంగా మహారాష్ట్రలో ఇప్పటికి సుమారు 26వేల మందికి కరోనా సోకింది. గుజరాత్లో 10వేలు, తమిళనాడులో పదివేలు, ఢిల్లీలో 8వేల మందికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలాయి.
అయితే, ఇప్పుడు ఆ రాష్ట్రాల నుంచి తక్కువ కేసులున్న రాష్ట్రాలకు జనసంచారం మొదలైతే వారిద్వారా ఆ రాష్ట్రాల్లో కూడా కాంటాక్ట్ కేసులు భారీగా పెరిగే ప్రమాదముంది. అయితే, అధికారులు, ప్రభుత్వం మాత్రం రైళ్లలో ప్రయాణించే వారికి అక్కడే పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి పంపుతామని చెబుతున్నా అది సాధ్యం కాని పని. ఒకవేళ వారు అక్కడ పరీక్షలు చేసి పంపినా.. కరోనా లక్షణాలు బయటపడడానికి 28 రోజులు పడుతుంది. అక్కడ నెగెటివ్ వచ్చిన వ్యక్తికి ఇక్కడ పాజిటివ్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో కరోనా వైరస్ మరింత తీవ్రంగా విజృంభించే ప్రమాదముందని జనం భయపడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఈ పరిస్థితి ఉంది. మూడు నాలుగు రోజుల వరకు జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప ఏ జిల్లాలోనూ కరోనా కేసులు బయటపడలేదు. కానీ, వలస కార్మికుల రాకతో ఈ పరిస్థితి తలకిందులైంది. చాలా జిల్లాలకు మళ్లీ ఈ వైరస్ అంటుకుంది. తెలంగాణలో వారం రోజుల్లో 41,805మంది వలస కార్మికులు వస్తే.. వారిలో 35మందికి పాజిటివ్ వచ్చింది. వీరంతా వివిధ జిల్లాలకు చెందినవారే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభిస్తే మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వివిధ రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.