FbTelugu

వాటికి అనుమతి అందుకేనా..?

కరోనా కాలంలో అన్ని విభాగాలతో పాటు సినిమారంగంపై కూడా ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో సినిమాలతో పాటు టీవీ షూటింగులకు కూడా తెరపడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొత్త సినిమాల రిలీజ్‌ కూడా ఆగిపోయింది. అయితే, ఇప్పుడు ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో మాత్రం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వలేదు. అయితే, ఏపీలో ముందస్తుగా సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం వెనుక మరో కారణం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు మద్రాస్‌ కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చింది. దానికోసం అప్పటి మహానటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఎంతో కృషి చేశారు. అయినా, పూర్తిస్థాయిలో రాలేదు. చాలామంది తెలుగు నటీనటులు ఇంకా అక్కడే ఉన్నారు.

అయినా, హైదరాబాద్‌కు చాలావరకు తెలుగు ఇండస్ట్రీ వచ్చినట్టే. షూటింగ్‌లు కూడా ఇక్కడ బాగానే జరిగాయి. అయితే, ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయిన తర్వాత ఏపీ సర్కారు సినిమా ఇండస్ట్రీని అక్కడకు తీసుకువెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, హైదరాబాద్‌లో ఇప్పటికే వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఉండడంతో ఇండస్ట్రీ ఏపీకి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో ఏపీ సర్కారు ప్రయత్నాలకు కొంతమేర ఫుల్‌స్టాప్‌ పడింది.

అయితే, ఇప్పుడు ఆ సర్కారు కరోనాను ఆధారంగా చేసుకొని సినీ ఇండస్ట్రీని తమ రాష్ట్రానికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో తెలంగాణకంటే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తక్కువ కేసులు నమోదవుతున్న తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.

కానీ, ఎక్కువ కేసులు నమోదవుతున్న ఏపీ మాత్రం వీటికి అనుమతి ఇచ్చేసింది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టపోయామని సినీ నిర్మాతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కంటే ముందుగా షూటింగ్‌లకు అనుమతి ఇస్తే నిర్మాతలు, దర్శకులతో పాటు సినీ ఇండస్ట్రీ అంతా ఏపీ వైపు మళ్లే అవకాశాలున్నాయని ఏపీ ప్రభుత్వం భావిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఆగమేఘాల మీద సినిమా షూటింగ్‌లకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

You might also like