FbTelugu

వారెందుకు కలిశారో?

ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతున్నాయా..? ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో హవా కొనసాగించిన కొంతకాలంగా మరుగున పడిన నాయకులు ఒక్కటవుతున్నారా?.

ఆ ఇద్దరు నాయకుల మధ్య రాత్రివేళ దేనిపై చర్చలు జరిగాయి. వీరితో పాటు కలిసివచ్చే నాయకులు ఎంతమంది ఉన్నారు. మాజీలంతా ఒక వైపునకు రానున్నారా..? అంటే నిజమేనమో అన్న అనుమానాలైతే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సెంట్రల్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు గురవారం రాత్రి సత్తుపల్లిలో ఏకాంతంగా సమావేశమయ్యారట. ఈ విషయం ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొంత కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేని ఈ ఇరువురు నాయకుల కలయికకు ఏదైనా రాజకీయ ప్రాధాన్యం ఉందా అనే విషయంపై టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య చర్చకు దారి తీసింది. గురువారం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాత్రి సమయానికి సత్తుపల్లిలోని మువ్వా విజయబాబు విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ వీరిద్దరే రెండు గంటలకు పైగా ఏకాంతంగా చర్చించుకున్నట్లు తెలిసింది.

పొంగులేటి ప్రధాన అనుచరుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ కూడా అక్కడే ఉన్నప్పటికీ పొంగులేటి, మువ్వా మధ్య జరిగిన చర్చల్లో పాల్గొనలేదు. పెనుబల్లి సొసైటీ అద్యక్షుడిగా గెలుపొందిన మువ్వా విజయబాబు తిరిగి సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పొంగులేటికి పార్టీ టిక్కెట్‌ ఇవ్వకపోవటంతో రాజకీయాల్లో పెద్దగా ఉత్సాహంగా కనిపించటం లేదు. అడపా దడపా జిల్లాలో పర్యటిస్తూ అనుచరులను కలుసుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మువ్వా విజయబాబు వద్దకు వెళ్లి రెండు గంటలకు పైగా ఏకాంతంగా చర్చించటంపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

గురువారం రాత్రి వీరి కలయిక అనంతరం శుక్రవారం మువ్వా విజయబాబును నియోజకవర్గం నుంచి పలువురు వచ్చి కలిసినట్లు సమాచారం. పొంగులేటి, మువ్వాల ఏకాంత చర్చల సారాంశం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, ఇది సాధారణ కలయికేనని రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని పొంగులేటి, మువ్వా అనుచరులు చెపుతున్నారు. ఈ కలయికకు అర్ధం ఏమిటో కొన్ని రోజులు పోతేగానీ తెలిసేలా లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.