FbTelugu

టీఎస్‌లో ఎందుకీ క‌రోనా హైడ్రామా!

2021 నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 21 కోట్ల మంది క‌రోనా భారిన ప‌డ‌తార‌ని శాస్త్రవేత్త‌లు అంచనా వేస్తున్నారు. 2020 అగ‌స్టు 15కు క‌రోనా వ్యాక్సిన్ తెస్తామంటుంది. భార‌త ప్ర‌భుత్వం. గాలి ద్వారా కూడా వైర‌స్ వ్యాపించేందుకు అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమంటుంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏపీ స‌ర్కారు రోజురోజుకూ వైద్య‌ప‌రీక్ష‌లు పెంచుతుంది. ఇప్ప‌టికే దాదాపు 10 ల‌క్ష‌ల మందిని ప‌రీక్షించింది. మ‌రి.. తెలంగాణ‌లో ఇప్ప‌టికే దాదాపు 28000 మందికి వైర‌స సోకింది. 16,000 మంది డిశ్చార్జి అయ్యారు. 12000 మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. 313 మంది మ‌ర‌ణించారు. వీరిలో జ‌ర్న‌లిస్టు మ‌నోజ్‌, తాజాగా ప్ర‌జాగాయ‌కుడు నిస్సార్ కూడా ఉన్నారు. కొద్దిరోజులుగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ చుట్టూ పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మొన్న ఓ ప‌త్రిక‌లో కేసీఆర్ కు పాజిటివ్ అంటూ రాయ‌టంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అస‌లు కేసీఆర్ ఎక్క‌డ‌.. ఎలా ఉన్నార‌నే అంశంపై మంత్రులు అధికారులు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కూడా క‌రోనా విష‌యంలో కేసీఆర్ దొంగాట ఆడుతున్నారంటూ దుయ్య‌బ‌ట్టారు. ఎంఐఎం కు భ‌య‌ప‌డి తెలంగాణ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌ట్లేదంటూ బీజేపీ ఘాటుగా వ్యాఖ్యానించింది.

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి బ‌హిరంగ స‌మావేశంలోనే కేసీఆర్ వైఖ‌రిని దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టికే వ‌ల‌స కూలీలు ప‌నుల్లేక‌పోయినా ప‌స్తులు ఉండేందుకు ఇష్ట‌ప‌డి సొంతూళ్ల‌కు చేరారు. హైద‌రాబాద్‌లో పెరుగుతున్న కేసుల‌తో ఇక్క‌డి చిరుద్యోగులు, వ్యాపారులు, ఉపాధి కోసం వ‌చ్చిన ల‌క్ష‌లాది మంది స్వ‌స్థ‌లాల‌కు ప్ర‌యాణం క‌ట్టారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా హైద‌రాబాద్ ఖాళీ అవుతుంది. మున్ముందు వైర‌స్ మ‌రింత వ్యాపిస్తుంద‌నే ఆందోళ‌న ఉన్నా ప్ర‌భుత్వం మెత‌క‌వైఖ‌రి అవ‌లంభించ‌టాన్ని విప‌క్షాల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా వ్య‌తిరేకిస్తున్నారు. అయినా.. పాల‌కుల తీరు మార‌ట్లేదు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో క‌రోనా సోకిన రోగుల‌కు మంత్రులు, ఉన్న‌తాధికారుల సిఫార్సుల‌తో బెడ్‌లు వెతుక్కోవాల్సి వ‌స్తుంది. మ‌రి సామాన్యుల ప‌రిస్థితి.. గాంధీ, నేచుర్ క్యూర్‌, ఆయుర్వేద‌, చెస్ట్ ఆసుప‌త్రుల‌కు వెళ్లాల్సిందే. అక్క‌డ కూడా వైద్యులు శాయ‌శ‌క్తులా ప్రాణాలు కాపాడేందుకు శ్ర‌మిస్తున్నారు. అయినా.. ఇప్ప‌టికే 313 మంది శ్వాస ఆడ‌క‌.. వైద్యం అంద‌క‌.. మ‌ర‌ణించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.