FbTelugu

ఎవరిది పాపం.. ఎవరికి శాపం!

ఒకరు చేసిన పాపానికి మరొకరు బలవుతున్నారు. అయినా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. హైదరాబాద్‌ విశ్వనగరంలో పాలకుల నిర్లక్ష్యానికి సాధారణ వ్యక్తులు, చిన్నారులు జీవిడుస్తున్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బాకా ఊదుతున్న సర్కారు పెద్దలు ఇటీవల వర్షాలకు నాలాలో పడి ఇద్దరు మరణించినా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరు కూడా కేవలం నాలుగు రోజుల్లోనే మరణించడం నగరాన్ని విషాదంలో ముంచింది. నాలుగు రోజుల క్రితం నేరెడ్‌మెట్‌లో సుమేధా నాలాలో పడి రెండు కిలోమీటర్లు కొట్టుకుపోయి మరణించింది. తాజాగా ఆదివారం సరూర్‌నగర్‌లో నవీన్‌కుమార్‌ స్కూటీపై వెళ్తే వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఆ నీటిలోనే ప్రాణాలు వదిలాడు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. హైదరాబాద్‌లో వర్షం పడిన ప్రతిసారీ ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఇలా నాలాల్లో పడి మరణిస్తూనే ఉన్నారు. రోడ్డుపై నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో.. ఏ నాలా నోరు తెరుచుకొని ఉందో తెలియక అమాయక జీవులు బలవుతున్నారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మాయమాటలు చెప్పి తప్పించుకోవడం తప్ప నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు, జీహెచ్‌ఎంసీ పాలకమండలి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలా నాలాలో పడి తనువులు చాలించిన వారి మరణానికి కారణం ఎవరు..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని హైదరాబాద్‌ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి పాలకులు చేసిన పాపమేనని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.