రంగారెడ్డి జిల్లా జన్వాడలోని ఓ ఫాంహౌస్ చుట్టూ కొంతకాలంగా వివాదం రేగుతోంది. ఆ ఫాంహౌస్ 111జీవో అమలులో ఉన్న ప్రాంతంలో నిర్మించడం ఈ వివాదానికి కారణమైంది.
అయితే, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఆ ఫాంహౌస్ రాష్ట్ర మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌దేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడింది. దీనిపై రేవంత్ కోర్టుకు కూడా వెళ్లారు. పైగా అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తనకు జన్వాడలో ఆస్తులున్నట్టు కేటీఆర్ చూపారని కూడా చెప్పారు.
అయితే, ఈ కేసుపై కేటీఆర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ఫాంహౌస్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కేటీఆర్‌దేనని రేవంత్ చెబుతున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా చూపారంటున్నారు. అలాంటప్పుడు రేవంత్ చెప్పినట్టు కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో దీని గురించి ప్రస్తావించారా.?. ఆ ఫాంహౌస్ తనది కాదని.. దానికీ తనకూ ఏ సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. కానీ, అది తనది కానప్పుడు ఆ ఫాంహౌస్ ఎవరిదో ఎందుకు బయటపెట్టడం లేదు.
అది తనది కాకుంటే రేవంత్ వేసిన కేసుపై కోర్టునుంచి కేటీఆర్ స్టే ఎందుకు తెచ్చుకున్నట్టు..? ఎన్నికల అఫిడవిట్లో తాను జన్వాడ ఆస్తుల లెక్క చూపలేదని ఎందుకు చెప్పడం లేదు. దాని కాపీలను ఎందుకు బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ అనేకమంది పేదల ఇళ్లను కూలుస్తున్న రాష్ట్ర సర్కారు 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఆ ఫాంహౌస్‌ను ఎందుకు కూల్చడం లేదు. ఇలాంటి అనుమానాలు ఎన్నో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నాయి.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సర్కారు వద్ద ఉన్నాయి. ఆ సర్కారు కూడా టీఆర్ఎస్దే. ఆ సర్కారుకు తండ్రి సీఎం, కొడుకు మంత్రి. వారు తలుచుకుంటే ఈ వివరాలను క్షణాలమీద బయటపెట్టొచ్చు. కానీ, ఎందుకు వాటిని బయటపెట్టడం లేదన్న ప్రశ్నలు సామాన్యులను ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. వాస్తవానికి ఆ ఫాంహౌస్ తనది కాకుంటే రేవంత్ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా దాని బండారాన్ని బయటపెట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ ఫాంహౌస్‌ను కూల్చివేయాలని వారు కోరుతున్నారు.