FbTelugu

85 దేశాల్లో డెల్టా రకం వైరస్: డబ్ల్యూహెచ్ఓ

జెనివా: ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ తో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. గత వైరస్ ల కన్నా ఈ వైరస్ అత్యంత వేగంతో విస్తరిస్తున్నదని ప్రకటించింది.
ఇదే తీరుగా వైరస్ విస్తరిస్తే పరిస్థితి దిగజారి ప్రమాదకరంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ వైరస్ సోకిన వారికి ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ఐసియు లో చేరే స్థితి ఎక్కువగా ఉంటుందని సింగపూర్ ప్రభుత్వ నివేదిక బహిర్గతం చేసింది. మరణాలు కూడా ఊహించని విధంగా ఉంటాయని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ గా మారినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో 40 కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉందని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవల తెలిపారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమన్నారు. కానీ డెల్టా ప్లస్ విషయంలో వ్యాక్సిన్ సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.