FbTelugu

ఎవరిది కరెక్ట్‌?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఒకటి, రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో అది విలయతాండవం చేస్తోంది. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

ఏపీలో అన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో మాత్రం జీహెచ్‌ఎంసీలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు అన్ని విషయాల్లో అటుఇటుగా ఏపీ, తెలంగాణ సీఎంలు ఒకే విధానం అమలు చేస్తున్నారు. కానీ, పాజిటివ్‌ టెస్టుల విషయంలో చెరో విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో రోజుకు 6వేల నుంచి పదివేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నారు.

తాజాగా ప్రతి ఇంటిలో ఒకరికి తప్పకుండా ఈ టెస్టులు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో మాత్రం ఈ టెస్టులను చాలా తక్కువగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ టెస్టులు అవసరం లేదని, లక్షణాలున్న వారికే టెస్టులు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కూడా చెప్పారు. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని చెబుతున్నారు. దీంతో పరీక్షల సంఖ్య చాలావరకు తగ్గింది. తెలంగాణలోని జిల్లాల్లో ఎక్కడా టెస్టులు చేయడం లేదు.

దీంతో అక్కడ రోజూ జీరో కేసులే నమోదవుతున్నాయి. ముందు తీవ్రంగా ఉన్న సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో కూడా దాదాపు 20 రోజులుగా కేసులేవీ నమోదు కాలేదు. కానీ, హైదరాబాద్‌ నగరంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రోజురోజకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వ్యాప్తి ప్రారంభంలో పాజిటివ్‌ ఉన్న వారికి లక్షణాలు కనిపించేవి. ఇప్పుడు ఆ లక్షణాలేవీ కనిపించకుండానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అందువల్లనే అందరికీ టెస్టులు చేసి వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నామని ఏపీ పాలకులు, అధికారులు చెబుతుంటే.. తెలంగాణలో మాత్రం అందరికీ అవసరం లేదు.. లక్షణాలున్న వారికే టెస్టులు చేస్తామని చెబుతున్నారు.

ఆ మేరకు టెస్టుల సంఖ్యను కూడా తగ్గించారు. అయితే, కరోనా టెస్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో ఏది మంచిదన్న చర్చ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. ఏపీలో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో మాత్రం ఏపీకంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని.. అందరినీ టెస్టు చేయడం వల్ల పాజిటివ్‌ వచ్చిన వారందరికీ చికిత్స చేసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో అందరికీ టెస్టులు చేయడంలేదు కాబట్టి భవిష్యత్‌లో దాని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ప్రజలు భావిస్తున్నారు. అయితే, ఈ రెండు రాష్ట్రాలు చేస్తున్న విధానాల్లో ఏది మంచి ఫలితాలను ఇస్తుందో తేలాలంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే మరి.!

You might also like