FbTelugu

కేంద్ర నిధులపై లెక్క తేల్చాలి: బండి సంజయ్

హైదరాబాద్: కరోనా ఎదుర్కొనేందుకు కేంద్రం మంజూరు చేసిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, మంత్రి కేటీఆర్ కు అందిన విరాళాలు ఎంత, వాటిని ఎలా ఖర్చు చేశారో చెప్పాలని కోరారు. ఈ మేరకు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.

 

నమస్కారాలతో,

ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు, దూరదృష్టితో ఆలోచించి దేశ, రాష్ట్రాల బాగు కోసం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి పైన లేని పోని విమర్శలు చేస్తూ, మీరు ఉపయోగించిన భాషని మీ విజ్ఞతకే వదిలి వేస్తున్నాం.

మీ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవటానికి, మాటల గారడీతో, కేంద్ర ప్రభుత్వం పై అర్థరహిత విమర్శలు చేస్తూ, రాష్ట్ర ప్రజలను, ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు?. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని మీరు అనటం, భూస్వామ్య విధానం, ఫ్యూడల్ స్వభావం గురించి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉంది. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అన్నారు, అంటే కేంద్రం నేరుగా నగదు ఇస్తే మీ జేబులు నింపుకుందామనా? అభివృద్ధి పనుల పేరుతో కమీషన్లు దండుకుందామనా?  ఇప్పుడిక అది సాధ్యం కాదు.

ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి సంస్కరణల పై మీరు అసంబద్ధమైన ఆరోపణలు చేశారు. సంస్కరణలు తేవటం, ప్రభుత్వపాలనలో ఒక భాగమే కదా. రైతు బంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమో మీరు స్పష్టం చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, రైతులకు క్రమం తప్పకుండా, అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నది. కానీ,  రైతు బంధు ద్వారా, రైతులకు ఇలా అందడం లేదు. మీరు, భవిష్యత్ లో రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేదా చెప్పండి?.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు, రాష్ట్రానికి కోవిడ్ నిధులను ఇవ్వలేదా? ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన రూ.224 కోట్లు, మెడికల్ పరికరాల కోసం ఇచ్చిన రూ.216 కోట్లు, డివల్యూషన్ నిధులలో తొలి విడతగా ఇచ్చిన రూ.982 కోట్లు, ఎలా ఖర్చు చేశారో, మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఇచ్చిన నిధులను, మీరు ఎలా ఖర్చు పెట్టారో చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు ఏవేవో  మాయమాటలు చెప్తున్నారు.

పీఎం కేర్స్ నిధుల నుంచి ప్రధాని, రూ.3100 కోట్ల ను వెంటిలేటర్ ల తయారీకి, వలస కార్మికుల కోసం, వాక్సిన్ అభివృద్ధికి కేటాయించారు. మరి, సీఎం రిలీఫ్ ఫండ్ కు, మీ కొడుకు కేటిఆర్ కు అందిన  విరాళాలు మొత్తం ఎంత? మీరు వాటిని ఎలా ఖర్చు పెట్టారు, ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వలస కార్మికుల తరలింపు కోసం, మీరు ఖర్చు పెట్టారని చెపుతున్న డబ్బులు, కేంద్రం ఇచ్చిన విపత్తు నిధి నుంచా?  లేదా వేరే నిధుల నుండి ఇవి వచ్చాయా?

కోవిడ్ వ్యాధిని ఎదుర్కొవటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులను, మీరు ఎలా ఖర్చు పెట్టారో, వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చెయ్యాలని, భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.

 

 

ఇట్లు

మీ భవదీయ

బండి సంజయ్ కుమార్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు.

You might also like

Leave A Reply

Your email address will not be published.