FbTelugu

వైట్ హౌస్ కు నిరసన సెగ.. బంకర్ లోకి ట్రంప్

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్ర తిరగ రాస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఒక లక్ష మందికి పైగా ప్రాణాలు విడిచారు. తాజాగా నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేశారంటూ లక్షలాది మంది వీధులలోకి వచ్చారు.

నిరసనకారులు ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందుకు చేరుకు నానా రచ్చ చేశారు. వేయికి పైగా నిరసనకారులు వైట్ హౌస్ ఉత్తరం దిశగా ఉన్న లఫాయెట్ పార్క్ కు తొలుత చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు ధ్వంసం చేసి టైర్లు తగలబెట్టారు. కొందరు చిన్న చిన్న రాళ్లు, ఇటుకలు, నీళ్ల బాటిళ్లు చేబుచ్చుకుని వైట్ హౌస్ మీదకి విసిరే ప్రయత్నం చేశారు.

నిరసనలు మిన్నంటడంతో సీక్రేట్ సర్వీసు ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సురక్షిత ప్రదేశంలో ఉంచాలని నిర్ణయించి, బంకర్ లోకి ట్రంప్ కుటుంబాన్ని హుటాహుటిన తరలించారు. సుమారు గంట నుంచి రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉండిపోయారు. టీవీలలో ప్రసారమవుతున్న నిరసన ను చూసి వైట్ హౌస్ అధికారులే ఆశ్చర్యపోయారు. ఇలా బంకర్ లోకి డొనాల్డ్ ట్రంప్ కుటుంబం వెళ్లడం ఇదే తొలిసారి అంటున్నారు.

నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయుడు ప్రయోగించాల్సి వచ్చింది. పోలీసు వాహనాలకు నిరసనకారులు అడ్డుపడినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా వారి మీదికి దూసుకువెళ్లాయి. దీంతో నిరసనకారులు పరుగులు పెట్టారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత ట్రంప్ వైట్ హౌస్ లోకి వచ్చారు.

You might also like