FbTelugu

ఈ వరదలు కారును ముంచేనా.. తేల్చేనా!

త్వరలో జరగనున్న హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ జోరుగా ఏర్పాట్లు చేసుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలకంటే ఎక్కువ స్థానాలను సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సారి కూడా వంద స్థానాలకంటే ఎక్కువగా వస్తాయని, సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌లు కూడా పదేపదే చెప్పారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ మహానగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి విశ్వనగరంగా మార్చామని చెప్పుకున్నారు. ఇదే అంశంతో ఈ ఎన్నికల్లో మళ్లీ ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు కారు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇంతలోనే వారికి పెద్ద అశనిపాతం వచ్చి పడింది. ఈ నెల 13,14,15 తేదీల్లో కురిసిన వర్షాలు కారు పార్టీకి అడ్డంకిగా మారాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వర్షాలతో హైదరాబాద్‌ నగరం సముద్రంలా మారింది. వరద తాకిడికి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.

ఇళ్లు, రోడ్లు చెరువుల్లా మారాయి. వరద నీటిలో వాహనాలు కాగితపు పడవలయ్యాయి. ముంపు ప్రాంతాల వారు రోడ్డు పాలయ్యారు. వరదలో అనేకమంది గల్లంతయ్యారు. రోడ్లు.. ఇళ్లు ఏకమయ్యాయి. మొత్తానికి నగరం అతలాకుతలమైంది. నగరవాసులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. దీంతో అధికార పక్షంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ నగరంలో ఏం చేసిందో తేలిపోయింది. అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఎవరూ తమను పట్టించుకోలేదని బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉప్పల్‌లో బాధితుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. బాధితులంతా ఆయనపై తీవ్ర విమర్శలకు దిగారు. అదేవిధంగా శుక్రవారం మీర్‌పేట ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా స్థానికులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఆమెను కొంతసేపు అడ్డుకున్నారు. ఇక, కార్పొరేటర్లు కనీసం వార్డుల్లో తిరిగే సాహసం కూడా చేయడం లేదు. ఈ పరిణామాలన్నింటినీ చూసిన మంత్రి కేటీఆర్‌ తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో తమకు ఎదురు లేదని భావిస్తున్న గులాబీ నేతలకు ఈ వర్షాలు అడ్డంకిగా మారాయన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఈ వర్షాలు కారును ముంచుతాయో.. తేల్చుతాయోనని టీఆర్‌ఎస్‌ నేతలు కూడా కలవరపడుతున్నారట మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.