FbTelugu

ఆయన ఓటుకే దిక్కులేదట!

అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తే తనకు న్యాయం కావాలని మొత్తుకుంటే.. ఓ పెద్ద పోలీస్‌ అధికారే తన ఇంట్లో  దొంగతనం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తే.. ఏంటీ ఇలాంటివి కూడా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతుంది కదా. అవును ఇలాంటివి కూడా జరగడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం.

ఇలాంటి సంఘటనే ఇప్పున మన పొరుగున ఉన్న ఏపీలో తెరమీదకు వచ్చింది. ఈ సంఘటనను చూస్తే మిలీనియం జోక్‌గా అనిపిస్తుంది కదా అని తీసిపారేయకండేయ్‌.. సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వారికి రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన వారిని వయోజనులుగా గుర్తించి వారికి ఓటుహక్కు ఇస్తారు. గతంలో అయితే ఓటుహక్కు కోసం పత్రాలను నింపి అధికారులకు ఇస్తే వారు విచారణ జరిపి ఓటుహక్కును కల్పించేవారు. ఈ ఓటుహక్కును కల్పించే అధికారం రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు అప్పగించింది. దేశంలో ఎవరికి ఓటుహక్కు కల్పించాలన్నా ఎన్నికల కమిషనే నిర్ణయం తీసుకుంటుంది. దేశంలోని ఎంత పెద్దస్థాయిలో ఉన్నవారికైనా ఓటుహక్కును కల్పించే సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు ఆయన రాష్ట్ర ప్రధానాధికారి. ఆ రాష్ట్రంలో ఓటుహక్కు కల్పించే అధికారం ఉన్న అధికారి. ఇప్పుడు ఆయనే తనకు ఓటుహక్కు కల్పించండి మహాప్రభో అంటూ మొత్తుకుంటున్నాడు.

అదేనండి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్‌కుమార్‌ తనకు ఓటుహక్కు కావాలని కోరుతున్నాడు. కోరడమే కాదండోయ్‌.. ఏకంగా ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి ఆయనకు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఓటుహక్కు ఉంది. ఆ ఓటును గుంటూరు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లాకు మార్చాలని అడిగారు. కానీ, సిబ్బంది ఆయనకు ఇక్కడ ఓటుహక్కు కల్పించలేదు. దీంతో రమేష్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ ఘటన గురించి చదువుతుంటే మీకేం అనిపిస్తుంది. సప్త సముద్రాలు ఈదిన వాడు మురికి కాల్వలో పడి చనిపోయినట్టుగా ఉంది కదా.. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.