అమరావతి: టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం ఎప్పుడు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. శ్వేతపత్రం ఇస్తామని గతంలో టీటీడీ ఈఓ అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేసింది.
దేవస్థానం ఆస్తుల విక్రయంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. టీటీడీ ఆస్తులు, దాతలిచ్చిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల గురించి కోర్టు ప్రస్తావించింది. ప్రజలు, భక్తులు, దాతలకు ఈ సమాచారం అవసరమన్న హైకోర్టు… శ్వేతపత్రం ఇస్తామని గతంలో అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వై. బాలాజీ వాదనలు వినిపించారు. దేవాదాయశాఖ అనుమతి లేకుండా దేవస్థానం ఆస్తులు విక్రయిస్తోందని ఆయన వాదించారు. స్థిర, చరాస్థుల రక్షణకు పారదర్శకత పాటించడం లేదన్న పిటిషనర్… అన్నిరకాల ఆస్తుల రక్షణ బాధ్యత తిరుమలకు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 14కి హైకోర్టు వాయిదా వేసింది.