అసలే ఆడపిల్లలు దొరకడం లేదు! కుదరక కుదరక పెళ్ళి కుదిరింది.
లగ్నం బాగుంది, ముహూర్తం కుదిరింది.. ఇక పెళ్ళి చేసుకోవడమే తరువాయి..!
ఒక్కసారి ఆ కళ్యాణవేడుకలో కరోనా మహమ్మారి తొంగిచూసింది. ఇంకేముంది.. ఒకటి, రెండు.. ఇలా నెలల తరబడి పెళ్లిళ్లు బంద్ అయ్యాయి. ఎప్పటికీ పెళ్లి అవుతుందో తెలియదు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతటా పెళ్లిళ్లు కుదిరి ఎంతో ఘనంగా వివాహం చేసుకుందామని భావించిన కుర్రాళ్లకు కరోనా ఎఫెక్ట్ పడింది.
పెళ్లిళ్లు నిలిచిపోయి ఎప్పుడు అవుతాయో తెలియక ఊసురూమంటూ కూర్చున్నారు. ఇక ఇలా కాదు అని చేసుకున్నా 20 మందికి మించి పిలిచే వీలు లేదు. పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దగ్గరి బంధువులే రాకుండా ఉండిపోతున్నారు.
ఏటా మార్చి ఏప్రిల్, మే, జూన్ మొదటిపక్షం వరకు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. నిత్యం బ్యాండు మేళాలు, సన్నాయి వాయిద్యాలతో ఒకటే సందడి కనిపించేది.
ఇప్పుడు ఎక్కడ చూసినా మూగబోయిన ఫంక్షన్ హాళ్లే కనిపిస్తున్నాయి. కరోనావైరస్ రావడంతో శుభకార్యాలన్నీ వాయిదా వేసుకుంటున్నారు. ఎక్కడైనా శుభకార్యం జరిగితే వెంటనే కరోనా వస్తుందేమోనని భయపడుతున్నారు. అంతేనా హైదరాబాద్ పాతబస్తీలో ఈ మధ్య యువకుడికి ఎంగేజ్మెంట్ జరిగింది. పరిమిత సంఖ్యలో బంధువులను ఆహ్వానించి ఆ తంతు కానిచ్చారు. తీరా చూస్తే వరుడికి కరోనా అని తేలింది. ఇంకేముంది ఆశలు ఆవిరి.
వరుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతేకాదు ఆ పార్టీలో పాల్గొన్న మరికొంత మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. చివరికి ఆ శుభకార్యానికి వచ్చిన అందర్నీ కూడా క్వారంటైన్‌కు పంపించారు. ఇలా అక్కడక్కడ తెగించి పెళ్లి నిశ్చితార్థం చేసుకుంటుంటే కరోనా వస్తోందన్న భయం వెంటాడుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల వరకు పెళ్లిళ్లు ఆగిపోయినట్లేనని పురోహితులు చెబుతున్నారు. ఎందుకంటే జూన్‌లో ముహూర్తాలు తక్కువ. పైగా నెలాఖరు నుంచి ఆషాదం వస్తుంది. మళ్లీ శ్రావణం వచ్చే వరకు పెళ్లిళ్లు జరగవు. అంటే ఇప్పుడు వాయిదా పడిన పెళ్లిళ్లన్నీ ఆగస్టు వరకు ఆగాల్సిందే. అదీకూడా అప్పటివరకు కరోనా తగ్గితేనే వీలవుతుంది. మరోసారి కరోనా విజృంభిస్తే మాత్రం ఇక మరికొన్ని నెలలపాటు వేచి ఉండకతప్పదు. అంతేనా.. ఈ పెళ్లిళ్లు ఆగిపోయిన ప్రభావం ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. ఫంక్షన్ హాళ్లు నడిపేవారు, వాటిపై ఆధారపడి బతికేవాళ్లు, క్యాటరర్స్, డెకరేటర్స్, పురోహితులు… పెళ్లితో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు.