FbTelugu

మాకెప్పుడో..?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయా అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దీనిపై కోర్టు డైరక్షన్‌ ఇస్తుందని, అది రాగానే ఆ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

అయితే, ఏపీలో మాత్రం పరీక్షల షెడ్యూల్‌ను ఆ ప్రభుత్వం విడుదల చేసింది. జూలై 10 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పైగా 11 పేపర్లుగా ఉన్న ఈ పరీక్షను కేవలం ఆరు పేపర్లకు పరిమితం చేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు మాత్రం తమ పరీక్షల తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారోనని ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి తెలంగాణలో రెండు పరీక్షలు ముగిశాయి. ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో ఆగిపోయాయి. పరీక్షలు ఆగి చాలారోజులు కావడం, వాటి నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో చాలామంది విద్యార్థులు చదువుపై ఇంట్రెస్ట్‌ను కోల్పోయారు. పుస్తకాలన్నీ మూలకేశారు. చదివిందంతా మర్చిపోయామని విద్యార్థులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఒకవేళ పరీక్షలు నిర్వహించినా చాలామంది ఫెయిల్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయితేనన్నా చదువుకోవడానికి ఇంట్రస్టు ఉంటుందని భావిస్తున్నారు.
ఎన్నో అనుమానాలు
తెలంగాణలో నిర్వహించే పరీక్షలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఒక్కో సబ్జెక్టుకు రెండు పేపర్లకు బదులుగా ఒకటే పేపరు చేసి 100 మార్కులకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయమే ఇక్కడ కూడా తీసుకుంటారా..? ఒకవేళ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇప్పటికే రాసిన పరీక్షల సంగతేంటి..? ఇప్పటికే పరీక్ష ప్రశ్నపత్రాలు ముద్రించి ఉన్నందున వాటిని మారుస్తారా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, అసలు టెన్త్‌ పరీక్షలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వానికే ఒక క్లారిటీ లేదని, అందుకే వాటి గురించి ఏమీ మాట్లాడడం లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా విద్యార్థులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

You might also like