FbTelugu

ఎల్జీ పాలిమ‌ర్స్ చుట్టూ ఏం జ‌రుగుతోంది?

విశాఖ ‌తీరం… నిత్యం ప్ర‌శాంత‌ వాతావ‌ర‌ణం. దేశ‌భ‌ద్ర‌త‌కు శిఖ‌రంగా నౌకాద‌ళం. ఆంధ్రుడి కీర్తిప‌తాక ఉక్కు ప‌రిశ్ర‌మ మ‌రోవైపు. ఇటువంటి చోట మే 6-7 తేదీల్లో దారుణం చోటుచేసుకుంది.

ఎల్జీ పాలిమ‌ర్స్ నుంచి విడుద‌లైన విష‌వాయువు గ్రామాలను క‌మ్మేసింది. నిద్ర‌మ‌త్తులో ఉన్న ప‌ల్లెప్ర‌జ‌ల‌కు ఏం జ‌రుగుతుందో అర్ధంకాలేదు. ఊపిరాడ‌క‌.. క‌ళ్లు క‌నిపించ‌క‌.. ఏ దిక్కుకు పోతున్నామో అర్ధ‌మ‌వ‌క‌.. ప‌రుగులు తీశారు. ప్రాణాలు ద‌క్కించుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. అస‌లు తాము ఎక్క‌డున్నామో.. త‌మ క‌ళ్ల‌కు ఏమైందో అర్ధ‌మ‌వ‌క‌.. మురుగునీటి కాల్వ‌లో ప‌డిపోయారు కొంద‌రు బైక్‌ల‌పై వెళ్లేవారు.

విగతజీవులుగా మారారు. బిడ్డ‌ల‌ను కాపాడుకోవాల‌ని త‌ల్ల‌లు.. కుటుంబాన్ని ర‌క్షించుకోవాల‌ని పురుషులు.. ఇలా దిక్కులు పిక్కుటిల్లేలా కేక‌లు వేస్తూ ప‌రుగులు తీస్తూ.. సాయం కోసం కేక‌లు వేశారు. గంట‌ల వ్య‌వ‌ధిలో ఎక్క‌డి వార‌క్క‌డ ప‌డిపోయారు. కొంద‌రు ఊపిరి ఆగిపోయింది. ఇంకొంద‌రు నిలుచున్న‌చోట‌నే కుప్ప‌కూలారు.. దారెంట వెళ్తున్న యువ‌కులు, పోలీసులు, పారిశుద్ధ్య‌ సిబ్బంది ప్ర‌తిఒక్క‌రూ ముందుకు వ‌చ్చారు. వంద‌లాది మందిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

కానీ.. అప్ప‌టికే దారుణం జ‌రిగింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద‌ల‌ మంది ఆసుప‌త్రిలో చికిత్స‌పొంది ఇళ్ల‌కు చేరారు. కానీ.. అక్క‌డ గ్రామాల్లో విష‌వాయువుల అవ‌శేషాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాణాంత‌క‌మైన విష‌వాయువు నెమ్మ‌దికి క‌బ‌ళిస్తుంది. వైద్య‌చికిత్స అనంత‌రం కోలుకుని ఇల్లుచేరిన వారిలో ముగ్గురు వ‌రుస‌గా మ‌ర‌ణించారు. వారి శ‌వ ‌ప‌రీక్ష‌లు చేసిన త‌రువాత కానీ వాస్త‌వాలు ఏమిట‌నేది చెప్ప‌లేమంటున్నారు వైద్యులు. ఈ భ‌యం.. ఆసుప‌త్రికి నుంచి డిశ్చార్జి అయిన‌వారిని వెంటాడుతుంది.

ఎందుకంటే స్టెరిన్ అనే విష‌వాయువు.. మూడు త‌రాల‌ను వెంటాడుతుంద‌ని వైద్యులు హెచ్చ‌రించారు. అంత‌ర్గ‌త అవ‌య‌వాల‌పై ప్ర‌భావం చూపుతూ క్ర‌మంగా మ‌నిషిని నిస్స‌హాయుడుగా మార్చుతుందంటున్నారు. ఈనేప‌థ్యంలో ముగ్గురి మ‌ర‌ణం.. వేలాదిమందిలో గుబులు పుట్టిస్తుంది. ఎల్జీపాలిమ‌ర్స్ కంపెనీకు అనుమ‌తి ఇచ్చింది నువ్వంటేనువ్వంటూ.. పార్టీలు కోట్లాడుకుంటున్నాయి. న‌ష్ట‌ప‌రిహారంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌నే భావ‌న‌కు పెద్ద‌లు వ‌చ్చారు. కానీ.. అక్క‌డ ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. ఏ క్ష‌ణాన ఏ ఇంట చేదువార్త వినాల్సి వ‌స్తుంద‌నే గుబులు ప‌ల్లెల్లో నెల‌కొంది.

దీనిపై అధ్య‌య‌నానికి వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఏమైనా.. స‌ర్కారు వేగంగా నిర్ణ‌యం తీసుకుంటే.. గ్రామ‌ప్ర‌జ‌ల్లో ధైర్యం వ‌స్తుంది. విష‌వాయువుకు విరుగుడుగా స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు చేప‌డితే వందలాది మంది ఊపిరి ఆగ‌కుండా కాపాడిన‌వార‌వుతార‌ని బాధిత‌ గ్రామాల ప్ర‌జ‌ల ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

You might also like