FbTelugu

సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరిగినా అది హాట్‌ టాపికే. సినీ పరిశ్రమను కేవలం నాలుగైదు కుటుంబాలే శాసిస్తున్నాయన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో అనేకసార్లు బయటపడ్డాయి.

శివాజీ రాజాపై కొందరు సభ్యులు ఆరోపణలు చేయడం, సినీహీరో రాజశేఖర్, జీవితలపై అనేక ఆరోపణలు రావడం లాంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెద్ద దుమారాన్నే లేపాయి. తాజాగా కరోనా కాలంలో మరో వివాదం ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. కరోనా కాలంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో అన్నిరంగాలతో పాటు సినిమా రంగం కూడా మూతపడింది. సినిమా, టీవీల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వాలు అనేక రంగాలకు వెసులుబాటు కల్పించింది.

దీంతో సినిమా రంగానికి కూడా ఈ వెసులుబాటు కల్పించాలని, సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని కొందరు నటులు, దర్శక నిర్మాతలు ఇటీవల తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు సినీరంగంలో విభేదాలకు తెరతీసింది. ఈ పరిణామాలపై అగ్రహీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు తెలియదు. పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు అన్నారు. అంతేకాదు. ఈ చర్చలకు తనను ఎవరూ పిలవలేదన్నారు. సినిమారంగంలోని కొందరు చర్చల పేరుతో మంత్రి తలసానితో కూర్చొని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం. వక్రీకరించేది ఏంటి.. ఇది వాస్తవం అని బాలకృష్ణ కామెంట్‌ చేశారు.

దీనిపై మరో అగ్ర నటుడు, చిరంజీవి సోదరుడు కొణిదెల నాగబాబు స్పందించారు. బాలకృష్ణ భూములు పంచుకుంటున్నారని మాట్లాడడం తప్పని అన్నారు. ఉక్రోశంతోనే ఆయన ఈ మాటలు మాట్లాడారని విమర్శలకు దిగారు. తక్షణమే ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇండస్ట్రీని బాగుచేస్తున్నారు తప్ప భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదని చెప్పారు. భూములు పంచుకోవడానికి అనడం ఏమిటి?. ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బాలకృష్ణ తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, చిత్ర పరిశ్రమను అవమానించారు. వెంటనే ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. వాస్తవానికి ఇదంతా చూస్తుంటే ఇండస్ట్రీలో షూటింగ్‌ల కోసం జరుగుతున్న తంతుగానే కనిపిస్తున్నా దీనివెనుక ఎవరి ప్రయోజనాలు వారికున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దర్శకరత్న దాసరి నారాయణరావు బతికున్న కాలంలో సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇండస్ట్రీకి కావల్సిన సూచనలు, సలహాలిస్తూ అందరినీ కలుపుకొని వెళ్లేవారు. సినీ ఇండస్ట్రీకి ఆయన పెద్దన్నగా వ్యవహరించేవారు. కానీ, ఆయన మరణంతో ఆ స్థానాన్ని సాధించేందుకు అనేకమంది పోటీ పడుతున్నారన్న చర్చ సాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా ఎన్‌టీఆర్, అక్కినేని, చిరంజీవి కుటుంబాలే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లన్నీ వీరి చేతిలోనే ఉన్నాయి. వీరి సినిమాలు రిలీజయ్యే సమయంలో వేరే వారి సినిమాలు ఆడించేందుకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఉందన్నది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర కోసం ఈ కుటుంబాలు ఆరాట పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇటీవల కేసీఆర్‌ను కలిసిన వారిలో చిరంజీవి, అక్కినేని నాగార్జున ఉన్నారు. కానీ, ఎన్‌టీఆర్‌ కుటుంబానికి చెందిన బాలకృష్ణను పిలవలేదు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేశారని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే బాలకృష్ణ, నాగబాబు మధ్య జరిగిన విమర్శల పోరుకు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లను వేదికగా చేసుకొంటున్నారని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.