FbTelugu

సాగర్‌లో ఏం జరగబోతోంది..!

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ ప్రయోగం ఇటీవల దుబ్బాకలో బెడిసికొట్టింది. అక్కడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఎన్నికల్లో ఆయన సతీమణికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. కానీ, ఓటర్లు ఆమెను తిరస్కరించారు. కనీసం సానుభూతి కూడా పనిచేయలేదు. గతంలో సానుభూతి సెంటిమెంట్‌ పనిచేసేది. ఇప్పుడు దుబ్బాకలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. దీంతో టీఆర్‌ఎస్‌ సాగర్‌ ఉప ఎన్నిక విషయంలో డైలమాలో పడింది.

సాగర్‌లో కూడా నోముల కుమారుడికో, సతీమణికో టికెట్‌ ఇస్తే రాజకీయ దిగ్గజమైన జానారెడ్డిని ఢీకొనలేమన్న భావనలో టీఆర్‌ఎస్‌ ఉంది. అందుకే అక్కడ అభ్యర్థిని మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, నోముల కుటుంబానికి టికెట్‌ ఇవ్వకుంటే పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంటుంది. పైగా ఆ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వారి ఓట్లు దూరమైతే పార్టీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోవడం ఖాయం. ఒకవేళ యాదవ వర్గానికే చెందిన మరొకరిని బరిలోకి దింపినా నోముల వర్గం సపోర్టు చేసేది అనుమానమే. దీంతో ఏం చేయాలో పాలుపోక టీఆర్‌ఎస్‌ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నుంచి జానారెడ్డి చాపకింద నీరులా ప్రచారాన్ని మొదలు పెట్టారు. బీజేపీ కూడా మొదట్లో జానారెడ్డి కానీ, ఆయన కుమారుడు కానీ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని లీకులిచ్చింది. కానీ, దీనిని జానారెడ్డి ఖండించడంతో బీజేపీ కూడా ఇప్పుడు కామ్‌ అయిపోయింది.

నోముల కుటుంబానికి టికెట్‌ ఇవ్వకుంటే..
ఒకవేళ నోముల నర్సింహయ్య కుటుంబానికి టికెట్‌ ఇవ్వకుంటే నర్సింహయ్య కుమారుడు భగత్‌ ఏం చేస్తారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నర్సింహయ్య సంతాపసభల పేరుతో యాదవవర్గాన్ని ఒక్కటి చేసే పనిలో పడ్డారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ టికెట్‌ తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరేవారికి ఇస్తే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బరిలో దిగే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. దీనికి కూడా ఆయన సంసిద్ధులవుతున్నారని సమాచారం. అయితే, సాగర్‌లో ఎప్పుడేం జరుగుతుందోనన్న అంశం ఆసక్తిని రేపుతోంది. సాగర్‌ ఉప ఎన్నిక నాటికి రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.