FbTelugu

వీరిద్దరూ కలిస్తే ఆయన పరిస్థితేంటి..?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు మిత్రపక్షంగా మారి మంత్రి పదవులను కూడా పంచుకుంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇటీవల ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు అమిత్‌ షా ను కలవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా కొనసాగడం ఆ పార్టీల ఇష్టం. దీనిపై ఎవరికీ అభ్యంతరం కూడా ఉండకపోవచ్చు. కానీ, వీరిద్దరి కలయిక మాత్రం జన సేనానికి ఇబ్బందికరంగానే మారనుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ (పీకే) ఈ పార్టీలకు మద్దతునిచ్చారు. తదనంతర పరిణామాల్లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ, టీడీపీకి దూరమయ్యారు.

టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీపై కూడా విరుచుకుపడ్డారు. ఇంతలో 2014 ఎన్నికలు కూడా వచ్చాయి. ఆ ఎన్నికల్లో పీకే పార్టీ కూడా పోటీచేసింది. స్వయంగా ఆయనే రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పోటీచేసిన రెండు చోట్లా పీకే ఓటమిని చవిచూశారు. ఆ పార్టీకి ఒక స్థానం మాత్రమే దక్కింది. చివరకు ఆ ఒక్కరు కూడా జగన్‌ పంచకు చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూడా విడివిడిగా పోటీచేశాయి. వీటికీ పరాభవం ఎదురైంది. చివరకు ఏపీలో అధికారాన్ని జగన్‌ నాయకత్వంలోని వైసీపీ సాధించింది. ఆ తర్వాత పరిణామాల్లో జనసేన బీజేపీకి దగ్గరైంది.

ఇదే సమయంలో జగన్‌పై బీజేపీ కూడా సమరం ప్రారంభించింది. ఇక జనసేన, బీజేపీలు మిత్రపక్షంగా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయని ఈ రెండు పార్టీల నేతలు ప్రకటించారు. ఈ తరుణంలోనే పీకే జగన్‌పై తీవ్ర విమర్శలకు దిగారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని జగన్‌పై ఒత్తిడిని పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా పెంచే కార్యక్రమానికి పీకే మరింత పదును పెట్టారు. అయితే, ఇప్పుడు పరిణామాలు మారుతున్నాయని, బీజేపీ, వైసీపీలు కలిసి మిత్రపక్షంగా వ్యవహరించబోతున్నాయని, మంత్రి పదవులు కూడా పంచుకోబోతున్నారని జోరుగా చర్చ సాగుతోంది.

ఇటీవల ఢిల్లీ పర్యటనతో ఇది మరింత బలపడింది. ఒకవేళ ఇదే జరిగితే తన పరిస్థితి ఏంటా అన్న ఆందోళనలో జనసేనాని పీకే ఉన్నట్టు చర్చ సాగుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షానికి పీకే సహకరించడానికి ప్రధాన కారణం జగన్‌ను అధికారంలోకి రాకుండా చేయడమేనన్నది జగమెరిగిన సత్యం. 2024లో జరిగే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే పీకే బీజేపీతో జత కట్టారన్నది కూడా కొట్టిపారేయలేనిది. మొదటి నుంచి జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న పీకే.. ఇప్పుడు తనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూటమిలోకి జగన్‌ చేరితే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ వారి కలయికే నిజమైతే ఏ నోటితో తాను జగన్‌ను తిట్టాడో.. ఇప్పుడు అదే నోటితో ఆయనను పొగడాల్సి వస్తుందేమోనని.. అది కుదిరే పనేనా అన్న మీమాంసలో పీకే ఉన్నారట. ఇప్పుడు పీకే పరిస్థితి ముందు వెళితే నుయ్యి.. వెనక్కి వెళితే గొయ్యిలా తయారైందని జనసైనికులు చెవులు కొరుక్కుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.