FbTelugu

ఆయనను ఏం చేద్దాం !

ఏపీలో ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉంటే.. అధికార పార్టీ ఎంపీ మాత్రం సొంత పార్టీపైనే బాణం గురిపెట్టారు.

దీంతో ఈ రెండు పార్టీల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వారంతా అధికార వైసీపీకి అనుకూలంగా నడుచుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావడంలో జగన్‌ విజయం సాధించారు.

కానీ, తన పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే అనేకసార్లు జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అసలు తాను పార్టీ టికెట్‌ అడగలేదని, పార్టీ నేతలు బతిమాలితేనే ఆ పార్టీ నుంచి పోటీచేశానని, జగన్‌ బొమ్మతో గెలవలేదని, తన సొంత ఇమేజ్‌తో విజయం సాధించానని చెప్పారు.

పైగా జగన్‌ కొంతమంది మాటలు విని తప్పుదోవ పడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. పైగా దమ్ముంటే జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేసి జగన్‌ బొమ్మతో మళ్లీ పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. మొత్తానికి ఈ ఎంపీ వ్యవహారం వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కూడా రఘురామ కృష్ణంరాజుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడక్కడా ఆయన దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. కానీ, ఆయనపై చర్యలకు జగన్‌మోహన్‌రెడ్డి తటపటాయిస్తున్నారు.

ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరిస్తే అతడు స్వతంత్రుడు అవుతాడు. అలాంటి పరిస్థితుల్లో అతను మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని ఆ పార్టీనేతలు, సీఎం జగన్‌ భావిస్తున్నారట. ఒకవేళ పార్టీలో అలాగే కొనసాగిస్తే ఆయన బాటలో మరికొందరిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారేమోనన్న అనుమానం కూడా వీరిలో ఉందట. అందుకే, ఆ ఎంపీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, ఆ విషయంలో ఆచితూచి అడుగేయాలన్న ఆలోచనలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చివరకు ఈ వివాదం దేనికి దారితీస్తుందో చూడాల్సిందే మరి.

You might also like