FbTelugu

వారి పరిస్థితి ఏంటి!

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. అదే తీరులో మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే 7,471 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ప్రధానంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు.

వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అందుకే వారు వైరస్‌ ధాటిని తట్టుకోలేక పోతున్నారన్న విషయాన్ని వారు చెబుతున్నారు. దీంతో బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో అనేకమందికి వైరస్‌ సోకిన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా చాలామందికి సకాలంలో నిర్ధారణ పరీక్షలు జరగట్లేదు. దీనిప్రభావం మున్ముందు చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. ఇండియాలో కరోనా బారిన పడిన చాలామందికి ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదు. లక్షణాలు కనిపిస్తున్న వారిలోనూ అందరికీ పరీక్షలు చేయట్లేదు.

రోగనిరోధక శక్తి చక్కగా ఉండి, బీపీ, మధుమేహం, గుండెజబ్బులు లేనివారికి వైరస్‌ సోకిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించినా.. కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువ. కానీ, ఈ సమస్యలున్నవారికి సకాలంలో పరీక్షలు చేయకపోతే ప్రాణాలకే ముప్పు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో అత్యధికం ఇలాంటివే. ఉదాహరణకు.. ఇటలీలో కరోనాతో చనిపోయినవారిలో 69 మందికి బీపీ, 32 మందికి మధుమేహం, 27 మందికి హృద్రోగాలున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులంతా కలపి 80 లక్షల మంది దాకా ఉంటారని అంచనా. వైరస్‌ వ్యాప్తి పెరిగితే వారికి ప్రమాదమే.
మధుమేహ రాజధానిగా ఇండియా
భారతదేశానికి ‘డయాబెటిస్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ అనే పేరుంది. అధికారిక గణాంకాల ప్రకారమే మనదేశంలో 2016 నాటికి 6.5 కోట్లమందికి పైగా మధుమేహ బాధితులున్నారు. అధిక రక్తపోటు బాధితుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. అందుకే మృతుల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉంటున్నారు. వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే.. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వస్తాయి. ఇటలీలోలాగా ఎవరికి చికిత్సనందించాలి? అనే సంకట స్థితి దాపురించే ప్రమాదం ఉంది.
ముందుగా పరీక్షలు చేస్తే..
దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తే వారిలో మరణాల తీవ్రతను తగ్గించే అవకాశాలున్నాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధిని కంట్రోల్‌ చేసేలా ప్రత్యేక చికిత్స కూడా అందించవచ్చని చెబుతున్నారు. కానీ, ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం మరణించిన వారికి కూడా టెస్టులు చేయాల్సిన పనిలేదని తెలంగాణ సర్కారు పట్టు పట్టింది. ఇలాంటి టెస్టులు కూడా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించిన హైకోర్టును తప్పు పట్టింది. హైకోర్టుకు దీనిపై అవగాహన లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత మరణాలను బట్టి చూస్తే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ముందుగానే పరీక్షించి చికిత్స అందిస్తే కరోనా మరణాల సంఖ్యను చాలావరకు తగ్గించే అవకాశాలున్నందున ఆ వైపు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.