FbTelugu

వాట్‌ నెక్ట్స్‌!

వాట్‌ నెక్ట్స్‌.. ఇదే పదం ఇప్పుడు ఏపీలో చక్కర్లు కొడుతోంది. సీఎం జగన్‌ నుంచి కిందిస్థాయి దాకా ఉత్కంఠ రేపుతోంది. తర్వాత ఏం చేయాలి అని ఏపీ సర్కారు.. ముఖ్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తుంటే.. రాష్ట్ర్రంలో ఏం జరగబోతుందా అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం జరిగిన పోరాటంలో ఇంతకీ ఎవరు గెలిచారు.

ఈ తీర్పుతో పంచాయతీకి తెరపడిందా.. లేక మరో రూపం దాల్చుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటీ.. ఈ సోదంతా ఏమిటీ.. దేనిగురించి చెబుతున్నారు అనేగా మీ ఉత్కంఠ. అయితే ఈ స్టోరీ చదవండి మరి.!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గత కొన్నిరోజులుగా జగన్‌ సర్కార్‌ వర్సెస్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఎన్నికలు ఇప్పట్లో వద్దని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పడం.. జరిగి తీరాల్సిందే అన్నట్లుగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇలా ఇద్దరూ పంతాలకు పోయారు. ఈ వ్యవహారం చివరికి కోర్టు దాకా వెళ్లడంతో
గురవారం నాడు స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది. 11న ఎస్‌ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్‌ జడ్జి కొట్టేయగా.. ఈ ఆదేశాలపై ఎస్‌ఈసీ అప్పీల్‌కు వెళ్లింది. మూడ్రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం శుభ పరిణామం అంటున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ ఎన్నికలు వాయిదా వేయాలని పట్టుబట్టిన సీఎం జగన్, వైసీపీ నేతల పరిస్థితి ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా.. లేక.. మరింత పట్టింపుతో జగన్‌ సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఇంత రాద్ధాంతం చేసిన సర్కారు ఎన్నికల నిర్వహణకు ఒప్పుకుంటుందనేది సందేహమే. ఒకదశలో ఎన్నికల ప్రక్రియ జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లా మారింది. ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.. ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగానే తీర్పునిచ్చినట్టయింది. మరి జగన్‌ ఈ తీర్పును ఒప్పుకుంటే నిమ్మగడ్డది పైచేయి అవుతుంది.

అందుకే ఆయన ఈ ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంతా భావిస్తున్నారు. సీఎం జగన్‌ కూడా ఈ తీర్పు తర్వాత ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం ఉంటుందా అన్న అనుమానం కూడా పీడిస్తుందట. ఇప్పటికే కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వాణిజ్య రంగాలు కూడా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. కాబట్టి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు చెబితే తమ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న కూడా జగన్‌ను వేధిస్తుందట. ఇప్పుడు తమ పరిస్థితి వెనుక నుయ్యి.. ముందు గొయ్యిలా ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారట. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై జగన్, వైసీపీ పెద్దలు గందరగోళంలో పడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.