FbTelugu

చంద్ర‌న్న మౌనం దేనికో సంకేతం?

పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచేందుకు ఏపీ స‌ర్కారు జీవో నెంబ‌రు 203 జారీ చేసింది. ఓకే… తెలంగాణ దీన్ని వ్య‌తిరేకిస్తుంది.. ఇదీ వోకే.

ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసే ఈ డ్రామా న‌డిపిస్తున్నాయంటూ విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి అదీ కూడా డబుల్ వోకే. మ‌రి చంద్ర‌బాబునాయుడు విప‌క్ష హోదాలో… జాతీయ నాయ‌కుడుగా ఎందుకు మాట్లాడ‌ట్లేదు. మౌనం వెనుక అర్ధం ఏమిటీ. పైగా తెలుగు త‌మ్ముళ్లు ఎవ్వ‌రూ నోరుమెద‌ప వ‌ద్దంటూ హుకుం కూడా జారీచేశార‌ట‌. బాబు అంటే ఒంటికాలిపై లేచే విజ‌యసాయిరెడ్డి ఏకంగా స‌వాల్ విసిరాడు.

అస్స‌లు నువ్వు రాయ‌ల‌సీమ బిడ్డ‌వేనా! ఆంధ్రుడివా అంటూ ట్వీట్ట‌ర్‌లోనూ తిట్టాడు. ఇక్క‌డా బాబు మౌనంగానే ఉన్నారు. పోతిరెడ్డిపాడుపై తాను మాట్లాడితే.. ఏం జ‌రుగుతుంద‌నే ఆందోళ‌న ఓ వైపు. రెండు క‌ళ్ల సిద్ధాంతంతో 2009 నుంచి 2019 వ‌ర‌కూ తెలంగాణ‌లో క్ర‌మంగా పార్టీ ప్ర‌భావం ప‌డిపోయింది. పార్టీ త‌ర‌పున నిలిపేందుకు అభ్య‌ర్థులు క‌ర‌వ‌య్యేంత వ‌ర‌కూ చేరింది. ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై బాబు స్పందిస్తే.. ఎలా ఉంటుంద‌నేది అర్ధంకాకుండా ఉంద‌ట‌. తెలంగాణ‌కు అనుకూలంగా మాట్లాడితే సీమోళ్లు దెబ్బేస్తారు. అస్స‌లే టీడీపీకు ఆయువుప‌ట్టు. పోన్లే ఏపీకు అనుకూలంగా మాట్లాడ‌దామంటే పొద్దున్నే కేసీఆర్ పంచాగం విప్పుతాడు.

రెండికి చెడ్డ రేవ‌డిగా మారుతుంద‌నే భ‌యంతో బాబోరు నోటికి తాళం వేశార‌ట‌. వాస్త‌వానికి ఇది జ‌గ‌న్‌, కేసీఆర్‌కూ స‌వాల్ వంటిదే రాజ‌కీయంగా కూడా ఇది ప్ర‌ధాన అస్త్రం కూడా విప‌క్షాలు బ‌లంగా లేక‌పోవ‌టం వ‌ల్ల జ‌గ‌న్‌, కేసీఆర్‌కు ఇప్ప‌టికిప్పుడే న‌ష్టం జ‌ర‌గ‌క‌పోయినా రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డానికి ఇదేనాందీ అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. నాగార్జున‌సాగ‌ర్ నీటి విష‌యంలో ఇప్ప‌టికీ చాప‌కింద‌నీరులా గొడ‌వ ఉండ‌నే ఉంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులోనూ అదే జ‌రిగితే మున్ముందు ఎటువంటి ప‌రిస్థితులు చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న ఇరు రాష్ట్ర ప్ర‌జ‌ల్లోనూ ఉంది.

You might also like