FbTelugu

ఏపీలో టీడీపీ ఎత్తు ఏమిటో..?

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్‌ సర్కారు మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ఆమోదించినా శాసనమండలిలో మాత్రం తిరస్కరణకు గురైంది. దీంతో మళ్లీ రెండోసారి కూడా శాసనసభలో పెట్టారు. అక్కడ మళ్లీ ఆమోదానికి గురైంది. శాసనమండలిలో కూడా మళ్లీ తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ద్వారా మూడు రాజధానుల బిల్లుకు ఆర్డినెన్స్‌ జారీ చేయించుకున్నారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గెజిట్‌ కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. వాస్తవానికి జగన్‌ మూడు రాజధానులు అన్నప్పటి నుంచే వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ వ్యతిరేకించాయి.

ముమ్మాటికీ ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ తమ వాణిని మరింత పెంచింది. దీనికితోడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారు నిర్ణయంపై ఫైర్‌ అయ్యారు. 48గంటల్లోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేశారు. కానీ, వైసీపీ సర్కారు దీనిపై ఎలాంటి స్పందనా వెలిబుచ్చలేదు. దాదాపుగా చంద్రబాబు మాటను వైసీపీ పట్టించుకునే దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? 48 గంటల ఆల్టిమేటం ఇచ్చిన చంద్రబాబు ఆ గడువు నాటికి వైసీపీ సర్కారు స్పందించకుంటే దానిపై ఎలాంటి భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టబోతున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదే విషయంపై రాజకీయ వర్గాలే కాదు వైసీపీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు సాధారణంగా ఇలాంటి టైంబాండ్‌ పెట్టారంటే.. దీనివెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని.. కాకుంటే ఆ నిర్ణయం ఏమిటా అన్నది వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అంతుబట్టడం లేదట. చంద్రబాబు పెట్టిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ గడువు ముగిస్తేగానీ చంద్రబాబు ఆలోచన ఏమిటో బయటపడదని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

You might also like