FbTelugu

పోతిరెడ్డిపై టీడీపీ విధానమేంటి: మంత్రి అనిల్

నెల్లూరు: పోతిరెడ్డిపాడుపై తెలుగుదేశం పార్టీ విధానం ఏమిటో ఇప్పటికీ చెప్పడం లేదని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమాకు కనీస పరిజ్ఞానం కూడా లేదని, బుర్ర తక్కువ.. నెల తక్కువ వ్యక్తి అని అపహాస్యం చేశారు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేసామని అబద్ధాలు చెబుతూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కేవలం ముప్పై శాతం పనులు మాత్రమే చేసిందన్నారు.

పోలవరంలో ఒక భాగానికి సంబంధించిన పనులు మాత్రమే టిడిపి చేసిందన్నారు.  మొత్తం  ప్రాజెక్టులో చూస్తే కనీసం 30 శాతం కూడా చేయలేదని ఆయన వివరించారు. ఆర్ అండ్ ఆర్ లో ఒక లక్షకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ నిర్వాసితులు ఉన్నారని, వారిలో ఒక్కరికి కూడా టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కట్టిచ్చి ఇవ్వలేదన్నారు. కాపర్ డ్యాం ఎత్తు పెంచి పేదల ఇళ్ళు ముంచి వారికి నష్టం చేశారన్నారు.  ఆర్ అండ్ ఆర్ పై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ కి లేదని అనిల్ స్పష్టం చేశారు.

పోతిరెడ్డి పాడు ఎత్తిపోతలపై జారీ చేసిన జీఓ 203 పై ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా రివర్ మేనిజిమెంట్ బోర్డుకు వివరణ కోరిందని, త్వరలోనే వివరణ ఇస్తామన్నారు. వివరణ ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నామన్నారు.

You might also like