FbTelugu

కేసీఆర్ సార్‌.. ఏమిటీ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం!

what-is-prasent-plan-of-kcr

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె తీవ్ర‌రూపం దాల్చుతోంది. క‌రీంన‌గ‌ర్‌లో డ్ర‌యివ‌ర్ బాబు మ‌ర‌ణంతో ఉద్య‌మం తారాస్థాయికి చేరిన ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. ఇది నిజంగానే స‌మ‌ర శంఖారావ‌మంటున్నారు కార్మికులు. మ‌రోవైపు ప్ర‌జ‌ల నుంచి కూడా క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోంది. రాబోయే స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచితీరాల‌ని భావిస్తున్న టీఆర్ ఎస్‌కు ఇది ఇబ్బంది క‌లిగిస్తుంద‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. కానీ హుజూర్‌న‌గర్‌లో సాధించిన 43 వేల మెజార్టీ ఇచ్చిన జోష్ గులాబీగూటిని బెదురులేకుండా చేస్తుంది. కోర్టు కూడా ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. అస‌లు ఏం చేయ‌ద‌ల‌కున్నారు.. కోర్టుకు నాలుగు ఏవో సాకులు చెబితే స‌రిపోతుందా అనేంత‌గా అక్షింత‌లూ చ‌ల్లింది. అయినా కేసీఆర్ అండ్ కోట‌రీలో ఎటువంటి చ‌ల‌నం లేదు. పైగా ప్ర‌యివేటు బ‌స్సుల‌కు సంత‌కం చేశారు. రేపో..మాపో 3000 ప్ర‌యివేటు బ‌స్సులు రోడ్ల‌పైకి తిరుగుతాయంటున్నారు. ఉద్య‌మం మొద‌లైన 28 రోజుల వ్య‌వ‌ధిలో క‌నీసం 10 మంది ఆర్టీసి కార్మికులు మ‌ర‌ణించారు. ఇద్ద‌రు బ‌లిదానం చేసుకున్నారు. ఇది ప్ర‌జ‌ల్లో బావోద్వేగాల‌ను రెచ్చ‌కొట్టేదిగానే ఉంద‌నేది జ‌గ‌మెరిగిన‌స‌త్యం. ఇన్ని వివాదాలు చుట్టుముడుతున్నా కేసీఆర్ వైఖ‌రిలో మార్పు రాక‌పోవ‌టం విస్మ‌యానికి గురిచేస్తుంది. నిజంగానే తాను అనుకున్న‌ది నెర‌వేర్చుతాడా.. హైకోర్టు ఆదేశాల‌కు క‌ట్టుబ‌డ‌తారా అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే హైకోర్టు కాదంటే. సుప్రీంకోర్టు ఉండ‌నే ఉంది.. అక్క‌డ తేల్చుకుందాం.. నీ ప్ర‌తాప‌ము. నా ప్ర‌తాప‌మూ అనేంత వ‌ర‌కూ కేసీఆర్ వెళ్లేందుకు వెనుకాడ‌ర‌నే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మ‌రోవైపు రెవెన్యూ, ఉపాధ్యాయ సంఘాలు బ‌య‌టి నుంచి ఆర్టీసీ కార్మికుల‌కు సంఘీభావం చెబుతున్నా ఎందుకో ప్ర‌త్య‌క్ష ఉద్య‌మంలోకి రాలేక‌పోతున్నారు. గ‌తంలో ఓ రెవెన్యూ అధికారిపై ఏసీపీ దాడి జ‌రిగాక‌.. రెవెన్యూ సంఘాల్లో వ‌ణ‌కు మొద‌లైంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. తాజాగా ఎన్‌జీవో సంఘ నేత‌లు కూడా కేసీఆర్‌ను క‌ల‌సి తాము మీ వెంటేనంటూ చెప్ప‌టం వెనుక కూడా.. ఉద్యోగ సంఘాల నేత‌ల అవినీతి కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇలా.. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేత‌ల బ‌ల‌హీన‌త‌లు, వారి వెనుక దాగిన చీక‌టి బాగోతాన్ని చూపుతూ ప్ర‌భుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తుందంటూ విప‌క్షాలు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఎదుటి వారి బ‌ల‌హీన‌త‌ను అవ‌కాశం చేసుకుని రాజ‌కీయాల్లో అధికారం చేప‌ట్టిన నేత‌ల‌కు.. ఇటువంటి ఉద్య‌మాలు కేవ‌లం ఆఫ్ట‌రాల్ అనే భావ‌న కూడా ఉంటుంద‌నే విశ్లేష‌ణ కూడా మేధావుల నుంచి వినిపిస్తుంది. వెర‌సి.. తన పంతం నెగ్గించుకునేందుకు కేసీఆర్ ఎంత‌వ‌ర‌కైనా వెళ్లేందుకు వెనుకాడ‌ర‌నేది ఇప్ప‌టి ప‌రిస్థితులు చెబుతున్న చేదునిజం.

You might also like