FbTelugu

గాంధీలో ఏం జరుగుతోంది?

గాంధీ ఆసుపత్రి కొవిడ్‌ ఆసుపత్రిగా మారింది. కరోనా సోకిన వారందరికీ అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కరోనా బాధితులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, వైద్య సిబ్బంది కూడా రాత్రింబవళ్లు వైద్య సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు.

కానీ, ఇటీవల అక్కడ జరుగుతున్న పరిణామాలపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు కరోనా వ్యాధితో చనిపోయింది తన భర్తేనా.. తన భర్త చనిపోతే మా కుటుంబానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని గాంధీ అసుపత్రి వర్గాలు, ప్రభుత్వంపై ఓ కుటుంబం వీధికెక్కింది. కోర్టు కూడా దీనిపై సర్కారుకు మొట్టికాయలేసింది. దీంతో సర్కారు అతడు మరణించాడని, కరోనా నిబంధనల ప్రకారం మున్సిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు జరిపామని, ఈ విషయాన్ని మృతుడి బంధువులకు చెప్పామని, మృతుడి కుటుంబం కూడా క్వారంటైన్‌లో ఉండడంతో వారికి చెప్పవద్దని బంధువులు చెప్పడంతో వారికి సమాచారం ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది.

ఈ వివాదం సర్దుమణుగుతున్న సమయంలో జర్నలిస్టు మనోజ్‌ వ్యవహారం బయటికొచ్చింది. కరోనా సోకిందని గాంధీ ఆస్పత్రికి వెళితే రాత్రంతా తన సోదరుడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదని, బెడ్లు ఖాళీ లేవని చెప్పారని మనోజ్‌ సోదరుడు ఆరోపిస్తున్నాడు. రాత్రంతా చికిత్స అందించకుండా డాక్టర్లు వచ్చే వరకూ ఇలాగే ఉండాలని చెప్పారని, కనీసం ఆక్సిజన్‌ కూడా పెట్టలేదని అతడు విమర్శించాడు. చివరకు కొంతమంది జర్నలిస్టులు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని మనోజ్‌ తన చివరి గడియల్లో అతడి స్నేహితులకు ఫోన్‌ మెసెజ్‌లు పంపాడు. చివరికి అతడు మరణించాడు. తాజాగా అదే గాంధీ ఆస్పత్రిలో ఒకరి మృతదేహాన్ని మరొకరికి అప్పగించి మళ్లీ తప్పులో కాలేశారు.

కరోనాతో ఓ వ్యక్తి మరణించాడని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి తమ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని చూసేందుకు వచ్చారు. చివరిసారిగా మీ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని చూడండని చూపించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మృతదేహం తమ కుటుంబ సభ్యుడిని కాదని చెప్పారు. తీరా చూస్తే వారి కుటుంబ సభ్యుడి మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది. వాస్తవానికి కరోనాతో ఆస్పత్రిలో మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. మున్సిపల్‌ సిబ్బంది, వైద్య సిబ్బందే ఖననం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన చూసిన తర్వాత ఇలా ఒకరికి బదులు ఒకరి మృతదేహాలను అని చెప్పి ఎన్నింటిని ఖననం చేశారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వరుస ఘటనలు గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో గాంధీకి ఇబ్బడి ముబ్బడిగా కరోనా కేసులు రావడం, వైద్య సిబ్బందికి కూడా పెద్ద ఎత్తున వైరస్‌ సోకడం జరుగుతోంది. ఉన్న తక్కువ మంది డాక్టర్లు ఎక్కువ మందికి వైద్య సేవలు అందించడంతో వారిపై పనిభారం ఎక్కువగా ఉందని, దీనికి తోడు వారిలో కూడా వైరస్‌ బాధితుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో మానసికంగా వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

You might also like