అదే నిజమైతే వైసీపీ పాలనకు పెద్ద మచ్చ ఏర్పడినట్టే. కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఇప్పటికే పరిపాలన చేతకాదంటూ విపక్షాలతో విమర్శలు ఎదుర్కొంటున్న జగన్‌కూ ఇది ఊహించని దెబ్బనే చెప్పాలి.
డాక్టర్ సుధాకర్ రావు. మొన్న కరోనా సమయంలో వైద్యులకు ఎన్95 మాస్క్‌లు ఇవ్వలేదంటూ జగన్ సర్కారును విమర్శించాడు. అది కాస్తా సోషల్ మీడియాలో హల్చల్ కావటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. అదే సమయంలో సీమకు చెందిన ఓ మున్సిపల్ కమిషనర్ రెడ్డిగారు కూడా ఇదే తరహాలో సర్కారు దుయ్యబట్టినా నామమాత్రపు చర్యలు మమ అనిపించారు.
దాన్ని కొద్దిసేపు పక్కనబెడితే డాక్టర్ సుధాకర్ ఘటన అనంతరం ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. నర్సీపట్నం నుంచి అసెంబ్లీ సీటుకు ఆశించిన డాక్టర్ సుధాకర్ టీడీపీ ఏజెంట్ అంటూ వైసీపీ ఆరోపించింది. జగన్ పక్కా ప్లానింగ్‌తో కరోనా కట్టడికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వంపై బురదజల్లేందుకు డాక్టర్ టీడీపీ చొక్కా కప్పుకున్నట్టు ప్రవర్తించారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తరువాత ఆయన గురించిన సమాచారం లేకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం విశాఖ పట్టణంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడట. ఈ సమాచారాన్ని 100 ద్వారా ప్రజలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారట.
అలా.. రంగంలోకి దిగిన పోలీసులపై కూడా సదరు మత్తులో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడ్డారట. అంతే.. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు డాక్టర్ సుధాకర్‌గా గుర్తించి కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవటంతో పిచ్చాసుపత్రికి చేర్చారు. ఇదీ పోలీసులు చెప్పిన విషయం. ఆ తరువాత హైకోర్టు జోక్యం చేసుకుని సుదాకర్ వాంగ్మూలం తీసుకునేందుకు జిల్లా న్యాయమూర్తిని నియమించింది. స్వయంగా వాంగ్మూలం తీసుకున్న ఆయన హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. నివేదికపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వ, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వైద్యుడి శరీరంపై గాయాలున్నట్టు చూపలేదని మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో గాయాలు కూడా ఉన్నట్టు గుర్తించారు.
దీని వెనుక ఏదో కుట్ర జరిగి ఉంటుందని భావించిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. 8 వారాల్లో నివేదిక ఇమ్మని చెప్పింది. ఇదంతా ప్రభుత్వానికి తెలిసి జరిగినా.. స్వామిభక్తి చాటుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపినా సీఎంగా జగన్ పాలనపై ఇది మచ్చగానే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. గతంలోనూ చింతమనేని ప్రభాకర్, ఎర్రన్నాయుడు, యరపతినేని వంటి టీడీపీ ప్రజాప్రతినిధులూ ప్రభుత్వ అధికారుల పట్ల ఇదే విధంగా ప్రవర్తించి… ప్రజా వ్యతిరేకతను కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే రిపీట్ అయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది రాజకీయ పండితుల అభిప్రాయం.