FbTelugu

అద్దెవాసుల పరిస్థితేంటి..?

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల విషయంలో ఓ కొత్త పాలసీ తీసుకువస్తోంది. దాని ప్రకారం బిల్లులు చెల్లించాలని చెబుతోంది. ఆ బిల్లు అమలైతే ప్రస్తుతం గ్యాస్‌ బిల్లుల విధానమే ఉంటుంది.

వినియోగదారుడు ముందుగా గ్యాస్‌ ధర మొత్తాన్ని చెల్లించాలి.. ఆ తర్వాత వినియోగదారుడి ఖాతాలో సబ్సిడీని వేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం చానాళ్ల నుంచి కొనసాగుతోంది. అయితే, కేంద్రం తాజాగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల్లో కూడా ఇదే విధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, దీనివల్ల పేదలకు మరిన్ని కష్టాలు ఎదురు కానున్నాయి. ఇది రైతులకు చాలా ఇబ్బంది కరంగా మారనుంది. ఇప్పటివరకు తెలంగాణలో రైతులు వ్యవసాయానికి విద్యుత్‌ను ఉచితంగా వాడుకుంటున్నారు.

ఇప్పుడు ఈ విధానంతో వారు భారీగా బిల్లులు చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పండిన పంటలో సగం వరకు విద్యుత్‌ బిల్లులకే సరిపోతుందని వారు చెబుతున్నారు. రైతుల సంగతి పక్కన బెడితే.. అద్దె ఇళ్లలో ఉండేవారి పరిస్థితి మరింత దారుణం కానుంది. ప్రస్తుతం 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడుకునేవారు 49 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు కొత్త విధానం ద్వారా వారు 307 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 50 నుంచి 90 యూనిట్ల వరకు వాడుకునేవారికి బిల్లు రూ.176 నుంచి రూ.675 వరకు, 91 నుంచి 125 యూనిట్ల వరకు వాడుకునేవారి బిల్లు రూ.437 ఉండగా, ఇప్పుడు వారు 940 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఇవి సబ్సిడీ లేకుండా పడే బిల్లులని.. ఈ బిల్లులు చెల్లిస్తే సబ్సిడీని తర్వాత వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని కేంద్రం చెబుతోంది. 200 యూనిట్లు దాటితే మాత్రం సబ్సిడీ కూడా వర్తించదు. కానీ, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్దె ఇళ్లలో ఉండేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అద్దెకు ఉండేవారి పేరుతో విద్యుత్‌ మీటరు ఉండదు. ఇంటి యజమాని ఆధార్, బ్యాంక్‌ అకౌంట్‌తోనే విద్యుత్‌ మీటరు వివరాలు నమోదై ఉంటాయి. అలాంటప్పుడు ప్రభుత్వం వేసే సబ్సిడీ కూడా ఇంటి యజమానులకే వెళ్తుంది. ఒకవేళ ఇంటి యజమానులను అడిగినా వారు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దె ఇళ్లలో ఉండే ప్రజలపై ఈ కరెంటు చార్జీల భారం భారీగా ఉంటుందని వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అందరికీ నష్టం కలిగించే ఈ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్నే కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.

You might also like