FbTelugu

ఏమిటీ గందరగోళం !

కరోనా వేళ సర్కారు, అధికారుల ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. దీంతో కరోనా కేసుల విషయంలో ఈ గందరగోళం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అసలు ప్రభుత్వం చెబుతున్న కరోనా పాజిటివ్‌ లెక్కలు కరక్టేనా అన్న అనుమానాలు కూడా తెలంగాణవాసులను వేధిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి నుంచి కరోనా కేసులకు దూరంగానే ఉంది. అనేక జిల్లాలు వైరస్‌ బారిన పడినా ఈ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదు. అక్కడి అధికారులు కూడా బయటి వ్యక్తుల ద్వారా ఈ వైరస్‌ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

అయితే, ఆదివారం తెలంగాణలో 33మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా నలుగురికి పాజిటివ్‌ లక్షణాలున్నట్టు ఆదివారం ఉదయం ఆ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. అయితే, సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్లో మాత్రం ఆ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు అయినట్టుగా చూపలేదు. వాస్తవానికి ఆ జిల్లాలోని పల్లెర్ల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చారు. వారు కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు.

వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదంతా ఆ గ్రామవాసులకు తెలిసిన విషయమే కానీ, ఈ నలుగురి లెక్కను కూడా ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ లెక్కల్లో కలిపి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. పైగా ఉదయం కలెక్టర్‌ ఒక రకంగా, సాయంత్రం ప్రభుత్వం ఒక రకంగా ప్రకటన చేయడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు ఉన్నట్టా.. లేనట్టా అని ఆ జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.