FbTelugu

భూములు డిజిటల్ సర్వే చేస్తాం: కేసీఆర్

– ధరణి విజయవంతం అయ్యింది
– భూమి శిస్తు లేనప్పుడు రెవెన్యూ పదంతో పనేంటి
– జుట్టుకు జుట్టుకు ముడేసే పంచాయతి ఉండదు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు తెలిపారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ లో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ, ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయింది. నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది. చివరికి సిసిఎల్ఏ, సిఎస్ కూడా రికార్డులను మార్చలేరని సీఎం స్పష్టం చేశారు.
కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నేను అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. ప్రతీ భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. నిజానికి ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆగింది. అతి త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభం అవుతుంది. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు.

గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10వేల సాయం అందిస్తున్నది. కాబట్టి రెవెన్యూ అనే పేరు కూడా ఇప్పుడు సరిపోదు. పేరు మారే అవకాశం ఉంది. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో ఎవరేమి పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుంది. ఆర్ఐ ఏం చేయాలి? తహసిల్దార్ ఏం చేయాలి? ఆర్డీఓ ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.